ఫరియా 'డబుల్’ ట్రీట్'.. ఎలాంటి హిట్స్ అందుకుంటుందో?
'చిట్టి నీ నవ్వుంటే లక్ష్మి పటాసే' అంటూ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.;
'చిట్టి నీ నవ్వుంటే లక్ష్మి పటాసే' అంటూ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ బ్యూటీ.. తర్వాత మాత్రం పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా, ఆమె కెరీర్ లో గట్టి హిట్ మాత్రం దక్కడం లేదు. దీంతో ఇప్పుడు ఆమె నుంచి రాబోతున్న రెండు సినిమాలపై ఆసక్తి పెరిగింది.
జాతిరత్నాలు సినిమాతో పరిచయమైన ఫరియా, అందులో చిట్టి పాత్రలో తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నా, కథల ఎంపికలో వచ్చిన లోపాలు ఆమెకు మైనస్ గా మారాయి.
మత్తువదలరా 2 సినిమా కొంతవరకు పర్లేదు అనిపించినా, అది కూడా పెద్ద హిట్ గా నిలవలేదు. ఆ తర్వాత వచ్చిన గుర్రం పాపిరెడ్డి సినిమా కూడా ఫరియాకు విజయాన్ని అందించలేకపోయింది. అయినా అవకాశాలు మాత్రం తగ్గలేదు. కొత్త కథలు, కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ఆ రెండు సినిమాలు వేర్వేరు కాన్సెప్ట్స్‌తో రూపొందుతున్నాయి. దీంతో ఈసారి ఫరియా డబుల్ ట్రీట్ ఇవ్వనుందన్నమాట. మొదటి సినిమా గాయపడ్డ సింహం. ఇందులో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అమెరికా వెళ్లాలనే కలలతో ఉన్న ఓ యువకుడి కథ నేపథ్యంలో సినిమా సాగుతుంది.
ఆ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీతో ట్రంప్ పాత్రను ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జెట్లీ సినిమా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న ఆ చిత్రాన్ని రితేష్ రానా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా కొత్త తరహాలో సాగుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న జెట్లీ సినిమా ఫరియాకు మరో అవకాశంగా మారింది. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఫరియా కెరీర్ లో ఇది కీలక దశగా మారింది. ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే, ఆమె కెరీర్ మళ్లీ ట్రాక్ లో పడే అవకాశం ఉంది. లేకపోతే మరోసారి హిట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి మే 1న ఫరియా అబ్దుల్లా నుంచి రాబోతున్న డబుల్ ట్రీట్ ఎలా ఉంటుందో, ఆమెకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.