మాంచి జోరు మీదున్న టైములో.. అవెంజ‌ర్స్ దుమారం!

భార‌త‌దేశంలో ఏదైనా సినిమాకి పాజిటివ్ టాక్ వ‌స్తే చాలు.. అది ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేగంగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

Update: 2026-10-28 07:45 GMT

భార‌త‌దేశంలో ఏదైనా సినిమాకి పాజిటివ్ టాక్ వ‌స్తే చాలు.. అది ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేగంగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. త‌ద్వారా వ‌సూళ్ల శాతం పెంచుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంది. అంతేకాదు.. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ముందుగా రిలీజ్ అయి, నెగెటివ్ టాక్ వ‌స్తే గ‌నుక ఆ ప్ర‌భావం భార‌త‌దేశంలో వ‌సూళ్ల‌పై చాలా ఎక్కువ‌. 150 కోట్లు పైబ‌డిన జ‌నాభా ఉన్న భార‌త‌దేశంలో ముంద‌స్తు సినిమా స‌మీక్ష‌ల ప్ర‌భావం కూడా చాలా అసాధార‌ణం. అందుకే ఇప్పుడు అవెంజ‌ర్స్ డూమ్స్ డే ముందస్తు రిలీజ్ ప్ర‌ణాళిక ఉత్కంఠ‌ను కలిగిస్తోంది. భార‌త‌దేశంలో ముందుగా రిలీజై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాకి అద్భుత‌మైన ఫాలోయింగ్ పెరిగి టికెట్ విండో కిట‌కిట‌లాడుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.




 


భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ దీపావళి కానుకగా డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్, స్టీవ్ రోజర్స్‌గా క్రిస్ ఎవాన్స్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అమెరికా కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 17న ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఈ దీపావళికి భారతీయ సినీ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ అందిస్తున్న ఈ కానుక ప్ర‌త్యేక‌మైన‌ది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `అవెంజర్స్: డూమ్స్‌డే` సినిమా 17 డిసెంబర్ 2026న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.




 


సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ భారతీయ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా, క్రిస్ ఎవాన్స్ స్టీవ్ రోజర్స్‌గా కనిపించనున్నారు.

వీడియో సందేశంలో వారు మాట్లాడుతూ.. ``నమస్తే ఇండియా! దీపావళి అంటే ఒక అధ్యాయం ముగిసి, మరో కొత్త అధ్యాయం ప్రారంభం కావడం... ఈ విషయం గురించి మాకు బాగా తెలుసు. అయితే, చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడానికి బదులుగా, ఈసారి బహుశా వెలుగు నుంచి చీకటివైపు ప్రయాణం సాగుతుందేమో! అందరికీ దీపావళి శుభాకాంక్షలు. `అవెంజర్స్: డూమ్స్‌డే`లో కలుద్దాం`` అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మూడు విభిన్న విశ్వాలకు చెందిన అభిమాన హీరోలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఎదురెదురుగా నిలవనున్నారు. వారు ఎన్నడూ ఎదుర్కోని అత్యంత భయంకరమైన ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సాగే పోరాటాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనున్నాయి.

ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజ్, లూయిస్ డి'ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్‌లతో పాటు క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ, వెనెస్సా కిర్బీ, ఈబన్ మాస్-బాచ్రాక్, వ్యాట్ రస్సెల్, చానింగ్ టాటమ్, సిము లియు, ఇయాన్ మెక్‌కెల్లెన్, హేలీ అట్వెల్, టామ్ హిడిల్‌స్టన్, జేమ్స్ మార్స్‌డెన్, పాట్రిక్ స్టీవర్ట్, జోసెఫ్ క్విన్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, లెటిటియా రైట్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దీపావళి శుభాకాంక్షలతో పాటు అమెరికా కంటే ముందుగానే సినిమా విడుదల కానుండటంతో భారతీయ అభిమానుల్లో `అవెంజర్స్: డూమ్స్‌డే`పై అంచనాలు మరింత పెరిగాయి. మార్వెల్ అభిమానులకు ఈ చిత్రం మరో భారీ సినిమాటిక్ వేడుకగా నిలవనుంది. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, భారతీయ థియేటర్లలో అదే రోజు ప్రత్యేక ప్రీమియం ఫార్మాట్లతో పాటు మార్వెల్ స్టూడియోస్ అందించే ఇన్ఫినిటీ విజన్ ఫార్మాట్‌లోనూ ప్రదర్శితం కానుంది. ఇటీవ‌ల హాలీవుడ్ సినిమాల జోరు కొన‌సాగుతున్న స‌మ‌యంలో అవెంజ‌ర్స్ భార‌తీయ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.



Full View


Tags:    

Similar News