వారణాసి బిజినెస్ పై అసలు ప్లాన్ ఏంటి?
ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే స్ట్రీమింగ్ సంస్థలు పెద్ద మొత్తాలు ఇవ్వడానికి పోటీ పడేవి.
ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే స్ట్రీమింగ్ సంస్థలు పెద్ద మొత్తాలు ఇవ్వడానికి పోటీ పడేవి. షూటింగ్ స్టార్ట్ కాకముందే డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయి నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఓటీటీ ప్లాట్ఫారమ్స్ అన్నీ బడ్జెట్ల విషయంలో కత్తెర వేస్తున్నాయి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఏకంగా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డున్న ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబో ప్రాజెక్ట్ చుట్టూ కూడా బిజినెస్ రూమర్లు నడుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
భారీ ఖర్చుతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. అయితే నాన్ థియేట్రికల్ హక్కుల అమ్మకాల విషయంలో కొంచెం ఆలస్యం జరుగుతోందని, అందుకే నిర్మాతలపై ప్రెజర్ పెరిగిందనే టాక్ సినీ సర్కిల్స్ లో నడుస్తోంది. ఏ సినిమాకైనా కోట్లు ఖర్చు పెట్టి ఏళ్ల తరబడి షూటింగ్ చేస్తున్నప్పుడు, రిలీజ్ కు ముందే డిజిటల్ రైట్స్ ద్వారా కొంత మొత్తం రికవరీ అవ్వాలని నిర్మాతలు కోరుకోవడం సహజం. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డల్ గా ఉండటంతో, అనుకున్నంత ఈజీగా డీల్స్ క్లోజ్ కావడం లేదనేది ఒక వర్గం వినిపిస్తున్న వాదన.
రాజమౌళి ఆలోచనా విధానాన్ని దగ్గరుండి చూసినవాళ్లు మాత్రం ఈ ప్రచారాన్ని వేరేలా చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న మార్కెట్ పరిధి కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. గ్లోబల్ స్టూడియోలతో టైఅప్స్ పెట్టుకుని, వరల్డ్ వైడ్ గా సినిమాను భారీ ఎత్తున తీసుకువెళ్లాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అలాంటప్పుడు కేవలం లోకల్ ఓటీటీ డీల్స్ కోసం కంగారుపడి ప్రాజెక్ట్ స్థాయిని తగ్గించుకునే అవకాశం ఉండదు.
అంతర్జాతీయ స్థాయి ప్లాన్స్ కొలిక్కి వచ్చేదాకా ఈ చర్చలను ఆయన కావాలనే హోల్డ్ లో పెట్టారనే టాక్ కూడా బలంగా ఉంది. అన్నిటికంటే మించి రాజమౌళి అసలైన బలం ఎప్పుడూ థియేటర్ల దగ్గరే ఉంటుంది. కథతో పనిలేకుండా కేవలం ఆయన పేరు చూసి టికెట్లు కొనే ఆడియన్స్ దేశవ్యాప్తంగా ఉన్నారు. హిందీ, తెలుగుతో పాటు మిగతా భాషల్లో థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో అందరికీ తెలిసిందే.
సినిమా టీజర్, ట్రైలర్ బయటకు వచ్చి హైప్ పెరిగాక వచ్చే డిజిటల్ ఆఫర్లు వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే మార్కెట్ కొంచెం నెమ్మదించిందన్న భయంతో తక్కువకే ఇచ్చేయకుండా, సరైన టైమ్ వచ్చేదాకా వేచి చూడటమే ఆయన స్ట్రాటజీ కావొచ్చు. నిర్మాతల వైపు నుంచి ఖర్చుల టెన్షన్ ఉండటం ఎంత సహజమో, ప్రపంచవ్యాప్త రిలీజ్ కోసం రాజమౌళి వేచి చూసే ధోరణిలో ఉండటం కూడా అంతే లాజిక్ గా కనిపిస్తోంది. బయట అనుకుంటున్నట్లు నిజంగానే ప్రొడ్యూసర్లపై ఒత్తిడి ఉందా, లేక గ్లోబల్ మార్కెట్ ను కొట్టడానికి జక్కన్న తెరవెనుక పెద్ద స్కెచ్ వేస్తున్నారా అనేది త్వరలోనే తేలనుంది.