'మెగావర్స్'లో ఉత్తమ జోడీ.. నెటిజనులేమంటున్నారు?
రియాలిటీ షోలు చప్పగా వండితే దానికి తగ్గట్టే జనాదరణ దక్కక తేలిపోతాయి.
రియాలిటీ షోలు చప్పగా వండితే దానికి తగ్గట్టే జనాదరణ దక్కక తేలిపోతాయి. షోలో పాల్గొనే సెలబ్రిటీల మధ్య కనీసం ప్రేమ- ఆప్యాయత లేదా వివాదం - ఘర్షణలు ఉన్నప్పుడే అంతో ఇంతో రక్తి కడుతుంది. అందుకే వివాదాస్పదులను కూడా ఇలాంటి షోలలో వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి.
తెర నిండుగా పెయిర్స్ రక్తి కట్టించేలా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అయితే మెగా వర్స్ లో అలాంటి వివాదాలకు ఆస్కారం ఉందో లేదో తెలీదు .. ఇది డిగ్నిటీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఈ వేదికపైకి ఎలాంటి ప్రముఖులను మెగాస్టార్ రప్పిస్తారు? అన్నది ఉత్కంఠగా మారింది. ఈలోగానే నెటిజనులు సోషల్ మీడియాల్లో వింత వింతగా ఊహిస్తున్నారు. వింతైన కాంబినేషన్లు కావాలని కోరుకుంటున్నారు.
పవన్ కల్యాణ్- అల్లు అర్జున్ :
పవన్ కల్యాణ్ మావయ్యతో అల్లు అర్జున్ కి ఇష్యూస్ ఉన్నాయంటూ ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేసింది దానికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. నేరుగా లైవ్ లోనే వారి స్నేహం, బంధుత్వ బాంధవ్యం అర్థమయ్యేలా చెప్పాలి. బయట జరిగే ప్రచారం వేరు..అంతర్గతంగా మెగా ఫ్యామిలీలో బాండింగ్స్ వేరు.. అనేది క్లారిటీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
మహేష్ - రామ్ చరణ్ :
సూపర్ స్టార్ మహేష్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరితో ఒకరు ఎంత సన్నిహితంగా, ఆప్యాయంగా ఉంటారో లైవ్ లో మెగా- ఘట్టమనేని అభిమానులు ఆస్వాధించే వీలుంది.. రెండు విభిన్నమైన ఫిల్మీ కుటుంబాల అగ్ర హీరోల కలయిక పెప్పీగా వీక్షకులకు కొత్తగా ప్రత్యేకంగా ఉంటుంది.. ఇది విభిన్నమైన కలయికగా ఆకర్షిస్తుంది..
ప్రభాస్ - అనుష్క : ఆ ఇద్దరూ ప్రేమికులు అని అంతా భావిస్తారు. కానీ మంచి స్నేహితులు అనే విషయం ఈ వేదికపై తెలుసుకోవడం అభిమానులకు కిక్కిస్తుంది. ప్రభాస్ - అనుష్క జోడీ అన్ని వేళలా అభిమానులకు స్పెషల్ ట్రీట్. అనుష్క స్పీడ్ ఇటీవలి కాలంలో తగ్గడానికి కారణమేమిటో కూడా ఫ్యాన్స్ కి ఈ వేదికపై తెలుసుకునే ఛాన్సుంటుంది.
బాలకృష్ణ - మోక్షజ్ఞ : నందమూరి నటవారసుడిగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. కానీ ఊహాగానాలు తప్ప కన్ఫర్మేషన్ రాలేదు. ఒకానొక దశలో ఆదిత్య 999 అంటూ ఆదిత్య 369 సీక్వెల్ కి బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం సాగింది. అది ఎందుకు వీలుపడలేదో తెలుసుకునే ఛాన్సుంటుంది. మోక్షజ్ఞ డెబ్యూ విషయమై నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్న వేళ చిరంజీవి షోలో దీనిపై క్లారిటీ వస్తే అంతకుమించిన కిక్కు ఇంకేమి ఉంటుంది?
తమన్నా- రాషా తడానీ : రవీనా టాండన్ కుమార్తె డెబ్యూ నటి రాషా తడానీతో సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా ర్యాపో ఎంతో అద్భుతంగా ఉంది. ఆ ఇద్దరి మధ్యా బాండింగ్ ఎలాంటిదో డిజిటల్ తెరపై ఆవిష్కరించే అవకాశం ఉంది.. తమన్నా గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవితో కలిసి నటించింది.
నటుడు శివాజీ - అనసూయ : బిగ్ బాస్ తర్వాత ఆ ఇద్దరి మధ్యా చాలా చెడింది. వారి మధ్య వివాదం పెద్ద రచ్చయింది. అలాంటి ఇద్దరిని ఒకే వేదికపైకి తెస్తే రచ్చ రంభోలా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆ ఇద్దరినీ కలిపేందుకు మెగా బృందం ఏదైనా చేయడానికి ఆస్కారం ఉందా?
రజనీకాంత్ - ధునుష్ : సౌతిండియాలో పాపులరైన మామ- అల్లుళ్ల వ్యవహారాన్ని డిజిటల్ తెరపై చూస్తే బావుంటుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కూతురు సౌందర్య నుంచి ధనుష్ విడిపోయాక రజనీకాంత్ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలని కూడా ఊహిస్తున్నారు.. ఇది ఒక భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.
కింగ్ నాగార్జున- నందమూరి బాలకృష్ణ ఒకే షోలో కనిపిస్తే అది నిజంగా బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ గా మారుతుందని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.. కానీ దీనిని సాధ్యం చేసే అవకాశం ఉందా? అనే సందేహాలున్నాయి.. ఆ ఇద్దరు హీరోల మధ్య వివాదాలున్నాయన్న ఎడతెరిపి లేని ప్రచారం ఉంది. దానిపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది.. రాజశేఖర్- జీవిత, మంచు మోహన్ బాబు- మంచు లక్ష్మి వంటి వారితోను మెగాషో రక్తి కట్టించేందుకు ఆస్కారం ఉంది. అయితే ప్రణాళిక ఎలా ఉంది? అన్నది వేచి చూడాలి.
బివిఎస్ రవి మ్యాజిక్ అలా పని చేస్తుందా?
మెగాస్టార్ చిరంజీవి టాక్ షో ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తుండగా, ఇది కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన లోకల్ ప్రదర్శనా లేక దేశవ్యాప్తంగా అలరించే పాన్-ఇండియా షోనా అనే చర్చ నడుస్తోంది. బాలకృష్ణ `అన్‌స్టాపబుల్`, జగపతి బాబు `జయమ్ము నిశ్చయమ్మురా` వంటి ప్రాంతీయ హిట్ షోలకు పనిచేసిన రైటర్ బి.వి.ఎస్. రవి ఈ ప్రాజెక్ట్ వెనుక కూడా ఉండటం గమనార్హం. అయితే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ రీచ్‌ను బట్టి ఈ షో క్యాన్వాస్ - ప్రొడక్షన్ ప్రమాణాలు చాలా భారీగా ఉండబోతున్నాయి. అగ్ర తారలతో షోని రక్తి కట్టించే ప్రణాళిక సాగుతోందని సమాచారం.
అయితే ఇతర భాషల నటీనటులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చిరంజీవికి భాష ప్రధాన సవాలుగా మారుతుందా? లేక మెగా బాస్ రౌడీ అల్లుడు తరహాలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో అదరగొడతారా? అన్నది ఉత్కంఠగా మారింది. బాస్ లో ఉండే సహజమైన టైమింగ్, సాన్నిహిత్యం ఇతర భాషలలో స్క్రిప్టెడ్ ఫార్మాట్ వల్ల దెబ్బతినకుండా చూసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వ్యాపార వ్యూహం ప్రకారం చిరంజీవికి దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్‌ను ఉపయోగించి దీన్ని పాన్-ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గెస్ట్‌ల ఎంపిక, ప్రెజెంటేషన్ శైలి.. విభిన్న ప్రాంతాల ప్రేక్షకులను కనెక్ట్ చేసే విధానంపైనే దేశ విదేశాలలో అన్నిచోట్లా సక్సెస్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. పాన్ వరల్డ్ లో ప్రజలంతా ఈ మెగా షో కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న వేళ నెట్ ఫ్లిక్స్ ప్రణాళిక ఎలా ఉందో.. బీవీఎస్ రవి రియాలిటీ స్క్రిప్టింగ్ నైపుణ్యం ఎలా పని చేస్తాయో వేచి చూడాలి.