పవన్, మహేష్.. ఇప్పుడు వెంకీతో ఏమవుతుందో?

పాతికేళ్ల క్రితం వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి'లలోని పెళ్లి కానీ ప్రసాద్ నవ్వులను తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ మరిచిపోలేదు.

Update: 2026-10-28 04:33 GMT

పాతికేళ్ల క్రితం వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి'లలోని పెళ్లి కానీ ప్రసాద్ నవ్వులను తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ కాంబో మళ్లీ వస్తోందంటే ఎవరి మైండ్ లోనైనా ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆలోచనలే మెదులుతాయి. కానీ కట్ చేస్తే.. ఈ సారి వస్తోన్న ఆదర్శ కుటుంబం కాంబో లెక్కలు వేరేలా ఉన్నాయి. తెరపై కనిపిస్తున్నది ఏకే 47లు, రక్తం, పద్మవ్యూహం లాంటి డార్క్ క్రైమ్ థ్రిల్లర్. భారీ అంచనాలతో థియేటర్‌కు వచ్చే జనాల మైండ్‌సెట్‌ను పక్కదారి పట్టించే ఇలాంటి ప్రయోగాల విషయంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు ఇప్పటికే చేదు, తీపి అనుభవాలు రెండూ ఉన్నాయి.

మహేష్ బాబుతో 'అతడు' లాంటి క్లాసిక్ తర్వాత చేసిన 'ఖలేజా'నే ఇందుకు మొదటి ఉదాహరణ. ఆడియన్స్ అతడు తరహా స్టైలిష్ యాక్షన్ ఊహించుకుని వస్తే, త్రివిక్రమ్ పూర్తిగా భిన్నమైన దైవత్వం కాన్సెప్ట్, కొత్త డైలాగ్ మాడ్యులేషన్ చూపించారు. కాలక్రమంలో అది కల్ట్ మూవీగా మారినా, రిలీజ్ రోజున అంచనాలు మిస్‌మ్యాచ్ అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర దెబ్బతింది.

ఇక పవన్ కళ్యాణ్‌తో 'జల్సా', 'అత్తారింటికి దారేది' లాంటి ఇండస్ట్రీ హిట్ల తర్వాత వచ్చిన 'అజ్ఞాతవాసి' ఫలితం మరింత దారుణం. ఫ్యాన్స్ కోరుకున్న వింటేజ్ పవన్ మేనరిజమ్స్ వదిలేసి, ఒక వింతైన టోన్ చూపించేసరికి మొదటి ఆటకు పారిన నెగెటివ్ టాక్ సినిమాను నిలువునా ముంచేసింది. మ్యాజిక్ ఏంటంటే.. ఇదే త్రివిక్రమ్‌కు అల్లు అర్జున్‌తో పనిచేసినప్పుడు మాత్రం ఇలాంటి తలనొప్పి ఎప్పుడూ రాలేదు.

'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో'.. ఏ సినిమా తీసుకున్నా బన్నీ నేటివిటీని, ఆడియన్స్ ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారనే పల్స్‌ను గురూజీ ఏనాడూ మిస్సవ్వలేదు. హీరో బలాన్ని మార్చకుండా తన మార్క్ కథలను అల్లి వరుసగా బాక్సాఫీస్ హిట్లు కొట్టారు. ఇప్పుడు సరిగ్గా వెంకటేష్ విషయంలోనూ అదే పెద్ద ప్రశ్నగా మారింది.

వెంకీ 'దృశ్యం' లాంటి సీరియస్ రోల్స్ లో మెప్పించినప్పటికీ, త్రివిక్రమ్ తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారంటే సగటు ప్రేక్షకుడు వెతికేది కడుపుబ్బా నవ్వించే వినోదం మాత్రమే. ఆ అంచనాలను పక్కనపెట్టి దర్శకుడు డార్క్ సర్వైవల్ కథను నడిపితే, మొదటి ఆటకే ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా రియాక్ట్ అవుతుందనే టెన్షన్ ట్రేడ్ లోనూ ఉంది.

ఈ ప్రయోగం బన్నీ సినిమాల తరహాలో వెంకీకి ఒక సరికొత్త మాస్ హిట్ ఇస్తుందా, లేక ఖలేజా, అజ్ఞాతవాసి తరహాలో అంచనాల బరువుతో రిస్క్ లో పడుతుందా అన్నదే అసలు పాయింట్. కథలో ఎమోషన్ బలంగా పండి ఈ కొత్త వెంకీని జనాలు ఓన్ చేసుకుంటే ఓకే.. అలా కాకుండా ఆ పాత నాస్టాల్జియా ఫన్ కోసమే వెతికితే మాత్రం ఆ పాతికేళ్ల జ్ఞాపకాలే సినిమాకు పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News