ధనుష్ 'ఓం' కి 2015 ఏపీ ఎన్‌కౌంటర్‌కి కనెక్షన్..?
ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదాస్పద పాయింట్‌ను జనాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొందరు ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదాస్పద పాయింట్‌ను జనాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొందరు ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా చిన్న వివాదాస్పద పాయింట్ దొరికితే దాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నాలు చేసే వారు చాలా మంది ఉన్నారు. కొన్ని వివాదాలు సినిమాలకు ప్లస్‌గా మారితే కొన్ని వివాదాలు మాత్రం సినిమాలకు మైస్ అవుతాయి. వివాదాల వల్ల పబ్లిసిటీ దక్కితే పర్వాలేదు, కొన్ని సార్లు వివాదాల వల్ల సినిమాలకు నష్టం జరగడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'ఓం : చాప్టర్ 1' సినిమా విషయమై చర్చ మొదలైంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏపీలో 2015 సంవత్సరంలో జరిగిన ఒక ఎన్కౌంటర్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ అప్పుడే చర్చ మొదలైంది.
సుకుమార్, అల్లు అర్జున్‌ల పుష్ప సినిమా తరహాలో...
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా నేపథ్యం, ఇతర విషయాల గురించి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. కానీ ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్, సాయి పల్లవి వీడియో అన్ని చూస్తూ ఉంటే ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ సాగే కథలా అనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనగానే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ప్రాంచైజీ సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆ సినిమాలకు పూర్తి విభిన్నంగా సాగుతుందని, ఈ సినిమా కథ మరో పాయింట్‌తో నడుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఎర్రచందనం కూలీలు పడే బాధలు, వారి కుటుంబాల మానసిక ఆందోళన ఇవన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ ను ఈ సినిమాలో ఎర్రచందనం చెట్లు నరికే కూలీలకు సంబంధించిన వ్యక్తిగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ పాత్ర విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.
శేషాచలం అడివిలో జరిగిన ఎన్కౌంటర్...
ఇదే సమయంలో ఈ సినిమా కథ ఏపీలో 2015లో జరిగిన ఒక సంఘటన చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు. ఆ సంఘటన వివరాల్లోకి వెళ్తే... ఏపీలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిని, ఎర్ర చందనం చెట్లను నరికే వారిని పోలీసులు కాల్చి చంపేశారనే వార్తలు వచ్చాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందిని ఎర్రచందనం కూలీలు ఆ సమయంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమపై దాడి చేసేందుకు కూలీలు ప్రయత్నించడంతో తప్పని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చినట్లు పోలీసులు ఆ సమయంలో ప్రకటించారు. ఎర్ర చందనం గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏపీలో జరిగిన ఆ ఘటనలో ఎక్కువ శాతం తమిళ యువకులు చనిపోయారు. దాంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వంపై తమిళనాడు ప్రభుత్వ వర్గాల వారు సీరియస్ కావడంతో పాటు, విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
ధనుష్ ఓం చాప్టర్ 1 సినిమాకు..
ఆ ఎన్కౌంటర్ కు సంబంధించి సుదీర్ఘ కాలం విచారణ జరిగింది. తమిళనాడు, ఏపీ మధ్య కొన్నాళ్ల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెల్ల మెల్లగా ఆ సంఘటన కాల గమనంలో కలిసి పోయింది. ఇప్పుడు ధనుష్ ఓం సినిమాతో మళ్లీ తెర మీదకు తీసుకు వచ్చాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ ఓం సినిమాలో ఏపీ పోలీసులకు వ్యతిరేకంగా సీన్స్ ఉంటే వివాదం మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన సీన్స్ ఉంటే వివాదం మళ్లీ మొదటికి వస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాలో ఏపీ ప్రభుత్వంను గురించి, ఏపీ పోలీసులను గురించి చూపించినట్లు కానీ, మరో రకంగా కానీ చెప్పలేదు. కనుక ముందుగానే ఊహించుకుని వివాదాలను మొదలు పెట్టడం సరికాదని సినీ గోయర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా విడుదల అయ్యేంత వరకు ఈ రచ్చ ఆపాలని కొందరు కోరుతున్నారు. ఈ సినిమాను నవంబర్ 20, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయి పల్లవి నటించిన నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. తెలుగులో పెద్ద మొత్తంకు ప్రముఖ నిర్మాత ఈ సినిమా పంపిణీ హక్కులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. ఈ సున్నితమైన పాయింట్‌తో వస్తున్న సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే వచ్చే నెలలో సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.