మైఖేల్ జాక్సన్ బయోపిక్.. కింగ్ ఆఫ్ పాప్ కథ మెప్పించిందా?
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా, MJ అభిమానులను ఎంతవరకు సంతృప్తిపరిచింది? అసలు ఈ సినిమాలో ఏం చూపించారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.;
సంగీత ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ పేరు తెలియని వారుండరు. అతని పాటలు, డ్యాన్స్ మూమెంట్స్ తరతరాలను ఊపేశాయి. ఇప్పటి వరకు చాలా డాక్యుమెంటరీలు వచ్చినా, పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం మాత్రం రాలేదు. ఎట్టకేలకు అంటోనీ ఫుక్వా దర్శకత్వంలో 'మైఖేల్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా, MJ అభిమానులను ఎంతవరకు సంతృప్తి పరిచింది? అసలు ఈ సినిమాలో ఏం చూపించారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నిజానికి మైఖేల్ జాక్సన్ జీవితం అంటే 1958 నుంచి 2009 వరకు జరిగిన ఒక పెద్ద ప్రయాణం. కానీ ఈ సినిమాలో కేవలం 1966 నుంచి 1988 వరకు ఉన్న కాలాన్ని మాత్రమే చూపించారు. అంటే మైఖేల్ ఎదుగుదల, ఆయన తండ్రి జోసెఫ్ జాక్సన్‌తో ఉన్న విభేదాల పైనే సినిమా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సినిమా చివర్లో 'కథ ఇంకా ఉంది' అని హింట్ ఇచ్చినా, ఒకే సినిమాలో ఆయన పూర్తి జీవితాన్ని చూడాలనుకున్న వారికి ఇది కొంచెం వెలితిగానే అనిపిస్తుంది. కేవలం సగం జీవితాన్నే చూపించడంతో ఇదొక అసంపూర్ణ నివాళిగా మిగిలిపోయింది. బహుశా రెండో పార్ట్ కు లీడ్ ఇచ్చారు అని అనిపిస్తుంది.
సినిమాలో ప్రధానంగా మైఖేల్ ఆయన తండ్రి మధ్య నడిచే డ్రామా కనిపిస్తుంది. జోసెఫ్ జాక్సన్ తన ఐదుగురు కొడుకులతో 'ది జాక్సన్ 5' బ్యాండ్ స్టార్ట్ చేయడం, అందులో మైఖేల్ ప్రతిభను గుర్తించి అతడిని ఒక మిషన్ లాగా ట్రైన్ చేయడం ఆకట్టుకుంటుంది. అయితే మైఖేల్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ని వెతుక్కుంటూ సోలోగా ఎదగాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే గొడవలు, ఎమోషన్లు సినిమాకు బలాన్ని ఇచ్చాయి.
కొన్ని చోట్ల మాత్రం కథనం చాలా నెమ్మదిగా సాగి బోర్ కొట్టిస్తుంది. మైఖేల్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని సున్నితమైన కోణాలను దర్శకుడు బాగా హైలెట్ చేశాడు. ముఖ్యంగా జంతువులతో ఆయనకు ఉన్న అనుబంధం, తోటి పిల్లలతో స్నేహం చేయలేక పడే బాధను ఎమోషనల్ గా చూపించారు. తన కళ్లలో కన్నీళ్లు ఫ్యాన్స్‌కు కనిపించకూడదని ఆయన సన్ గ్లాసెస్ పెట్టుకునే సీన్ చూస్తే గుండె బరువెక్కుతుంది.
అలాగే నల్లజాతి కళాకారులపై అప్పట్లో ఉన్న వివక్ష, ఎంటీవీ లాంటి సంస్థలు ఆయన పాటలను ప్రసారం చేయడానికి నిరాకరించిన తీరు సామాజిక వాస్తవాలను కళ్లకు కట్టాయి. ఇలాంటి ఎమోషనల్ సీన్లు సినిమాకు ప్రాణం పోశాయి. నటన పరంగా చూస్తే మైఖేల్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ అద్భుతం చేశాడనే చెప్పాలి. మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా తన మామ మేనరిజమ్స్, డ్యాన్స్ స్టెప్పులను అచ్చుగుద్దినట్లు దించేశాడు.
తండ్రి పాత్రలో జూలియానో క్రూ క్రూరత్వాన్ని పండించగా, తల్లి పాత్రలో నియా లాంగ్ తన నటనతో మెప్పించింది. టెక్నికల్ గా ఐమాక్స్ స్క్రీన్ పై విజువల్స్, మ్యూజిక్ పీక్స్ లో ఉన్నాయి. అయితే మైఖేల్ జీవితంలోని వివాదాలను టచ్ చేయకుండా కేవలం మంచిని మాత్రమే చూపించాలని చేసిన ప్రయత్నం వల్ల ఇది పక్కా పీఆర్ డ్రివెన్ సినిమా అనిపిస్తుంది. కేవలం ఒక మ్యూజికల్ జర్నీలా ఈ సినిమా సాగుతుంది. మైఖేల్ జాక్సన్ లాంటి లెజెండ్ గురించి తెలుసుకోవడానికి ఒకసారి చూడొచ్చు కానీ, ఇదొక పర్ఫెక్ట్ బయోపిక్ అని మాత్రం చెప్పలేం అని టాక్ వస్తోంది.