పదేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను.. లావణ్యతో వరుణ్ లవ్!
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ కపుల్స్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వెండితెరపై తమ కెమిస్ట్రీతో అలరించడమే కాకుండా.. నిజ జీవితంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఆదర్శ ప్రేమజంటగా నిలిచారు. పదేళ్ల క్రితం మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత గాఢమైన ప్రేమగా మారి.. నేడు ఒక అందమైన కుటుంబ బంధంగా రూపాంతరం చెందింది. సినీ పరిశ్రమలో సెలబ్రిటీ బంధాలపై ఎన్ని రూమర్లు వచ్చినా.. తమ సంబంధాన్ని ఎంతో గౌరవప్రదంగా.. వ్యక్తిగతంగా కాపాడుకుంటూ ఈ మెగా జోడీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఇటీవలే తమ పదేళ్ల పరిచయంతో పాటు వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకుని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. తమ పెళ్లి రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లావణ్యతో ఉన్న ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేస్తూ.. తన మనసులోని ప్రేమను ఎంతో ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. పదేళ్ల కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో గుర్తుచేసుకుంటూ.. గడిచే ప్రతి క్షణం లావణ్యపై ఉన్న ప్రేమను మరింత పెంచుతోందని వరుణ్ తేజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
వరుణ్ తేజ్ తన సందేశంలో ``హ్యాపీ యానివర్సరీ లవ్! మనం కలిసి పదేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రతి రోజు, ప్రతి ఏటా నీతో మళ్లీ మళ్లీ ప్రేమలో పడటానికి నాకు కొత్త కారణాలు దొరుకుతున్నాయి. మన ప్రపంచంలోకి వచ్చిన చిన్ని ప్రాణంతో పాటు నువ్వే నా సమస్తం.. నా హ్యాపీ ప్లేస్`` అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వారి మధ్య ఉన్న అపారమైన అనురాగాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని ప్రతీకగా నిలిపింది.
ఈ భావోద్వేగపూరిత ప్రకటన నెట్టింట ప్రత్యక్షమవ్వగానే మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కురిసింది. వరుణ్ సోదరి నిహారిక కొణిదెలతో పాటు అల్లు శిరీష్, రుహానీ శర్మ వంటి నటీనటులు కామెంట్ సెక్షన్లో తమ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున మెసేజ్‌లు చేస్తూ ఈ క్యూట్ కపుల్‌కు దీవెనలు అందించారు.
ఇటలీలో ఎంతో వైభవంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వరుణ్-లావణ్య, నేడు ఒక పండంటి బిడ్డకు తల్లిదండ్రులుగా తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆస్వాధిస్తున్నారు. దశాబ్ద కాలం నాటి తమ బంధానికి అనురాగానికి గుర్తుగా నిలిచిన ఈ యానివర్సరీ పోస్ట్ వారు ఒకరికొకరు ఎంతటి బలమైన భాగస్వాములో మరోసారి చాటిచెప్పింది.