పండగ రేసులో భారీ చిత్రాల సునామీ
సంక్రాంతి పండుగ అంటే? టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద వార్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
సంక్రాంతి పండుగ అంటే? టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద వార్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. పండగ రేసులో భారీ చిత్రాలు పోటీ పడటం సాధారణమే అయినా 2027 సంక్రాంతి మాత్రం ట్రెండ్‌కు భిన్నంగా రస వత్తరంగా మారుతోంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలు ఆసక్తికరమైన చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తాయని ప్రకటనలు రాగా తాజాగా తమిళ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ `వేట్టువం` కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పోటీ మరింత రంజుగా మారింది.
ఇప్పటికే `కాకా`, `సంబరాల ఏటిగట్టు`, `మహాకాళి`, `జార్జిక్రిష్` వంటి చిత్రాలు ఇప్పటికే సంక్రాంతిని లాక్ చేసాయి. రొటీన్ కమర్షియల్ హంగులకు భిన్నంగా విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ సినిమాల మధ్యే గట్టి పోటీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. సరిగ్గా ఇదే సమయంలో కోలీవుడ్ నుంచి పా. రంజిత్ నుంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `వేట్టువం`ను బరిలోకి దించడంతో పండగ వార్ నేషనల్ వైడ్ ట్రెండింగ్‌గా మారింది.
ఆర్య, శోభిత ధూళిపాళ్ల, వి.ఆర్. దినేష్ నటిస్తోన్న `వేట్టువం` ను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్- నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన `వరల్డ్ ఆఫ్ వేట్టువం` గ్లింప్స్‌కు తెలుగులో రానా దగ్గుబాటి.. మలయాళంలో సౌబిన్ షాహిర్.. కన్నడలో కిచ్చా సుదీప్ వాయిస్ ఓవర్ అందించడంతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను క్రియేట్ చేశారు. కేవలం తమిళానికే పరిమితం కాకుండా అన్ని భాషల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రంజిత్ ఈ చిత్రాన్ని సిద్దం చేస్తున్నారు.
ఒకవైపు తెలుగు నేటివిటీ చిత్రాలు.. మరోవైపు మాస్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్‌తో వస్తున్న `వేట్టువం` లాంటి పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొనడం ఖాయం. పండగ సీజన్‌లోని సెలవులను క్యాష్ చేసుకోవడానికి అన్ని చిత్రాల నిర్మాతలు రణరంగంలోకి దిగుతున్నారు. ఏ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది అంతుచిక్కని విధంగా సంక్రాంతి బరి రంజుగా మారుతోంది.
ప్రేక్షకులకు మాత్రం ఈ సంక్రాంతికి విభిన్న జోనర్ల చిత్రాల రూపంలో నిజమైన ఫెస్టివల్ ట్రీట్ దక్కనుంది. ఒకవైపు గ్రామీణ నేపథ్య చిత్రాలు.. మరోవైపు రా అండ్ రగ్డ్ యాక్షన్ థ్రిల్లర్లు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఏదేమైనా? పా. రంజిత్ ఎంట్రీతో 2027 సంక్రాంతి ప్రాంతీయ చిత్రాల మధ్య పోరు రసవత్తరంగా మారనుందని తెలుస్తోంది.