ఇండియన్ స్క్రీన్‌పై ఫస్ట్ టైమ్ `లాంబోదర 2.0` ప్రయోగం!
ఈ ప్రయోగం గురించి దర్శకుడు సునీల్ కుమార్ ఓపెన్ అయ్యారు. ఒక రోబోట్‌తో నటీనటుల తరహాలో షాట్లు తీయడం తీవ్రమైన సవాలుతో కూడుకున్న పని అని వెల్లడించారు.
వెండితెరపై ఊహలకు అందని విజువల్స్ చూపించడం ఒకెత్తయితే.. నిజ జీవితంలో మానవాళి భవిష్యత్తును మార్చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ వంటి సాంకేతిక విప్లవాన్ని నేరుగా కథలో భాగం చేసి చూపించడం మరొకెత్తు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం విజువల్ ఎఫెక్ట్స్ వరకు మాత్రమే పరిమితం చేస్తున్న రోజుల్లో ఏకంగా ఒక `రియల్ ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్నే` సినిమాలో నటింపజేస్తూ కన్నడ చిత్రసీమ ఓ సంచలన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దర్శకుడు సునీల్ కుమార్ తెరకెక్కించిన `లాంబోదర 2.0` చిత్రం ద్వారా సైన్స్ టెక్నాలజీ ..సోషల్ మీడియా మేళవింపుతో కూడిన సైన్స్ ఫిక్షన్ సోషల్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు.
మాస్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. 1991 నాటి క్లాసిక్ కన్నడ చిత్రం `గౌరి గణేష్‌లో` దివంగత లెజెండరీ నటుడు అనంత నాగ్ పోషించిన ఐకానిక్ `లాంబోదర` పాత్ర ప్రేరణతో చిత్రానికి శీర్షికను ఖరారు చేశారు. ఆధునిక సమాజంలో సాంకేతికత మానవ జీవితాలను, భావోద్వేగాలను ఎంతలా ప్రభావితం చేస్తోందో నిరూపించేలా మనుషుల ఆనందాన్ని కొలిచే ఓ వినూత్న రియాలిటీ షో నేపథ్యాన్ని ఎంచుకుని కథనాన్ని మలిచారు.
ఈ చిత్రంలో అత్యంత ప్రధానమైన అరుదైన ఆకర్షణ `జియా` అనే ఏఐ-పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్. బెంగళూరుకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ `మచాని రోబోటిక్స్` ప్రత్యామ్నాయంగా ఒంటరిగా ఉండే వృద్ధుల సంరక్షణ కోసం ఈ హ్యూమనాయిడ్‌ను డిజైన్ చేసింది. అయితే సినీ చరిత్రలోనే తొలిసారిగా హ్యూమనాయిడ్‌ను పూర్తిస్థాయి పాత్రలో నటుడిగా డిజిటల్ స్క్రీన్‌పై చూపించడం విశేషం. ఏఐ టెక్నాలజీని వినోద రంగానికి అనుసంధానించడంలో ఈ ప్రయోగం అతిపెద్ద మైలురాయిగా నిలవనుంది.
ఈ ప్రయోగం గురించి దర్శకుడు సునీల్ కుమార్ ఓపెన్ అయ్యారు. ఒక రోబోట్‌తో నటీనటుల తరహాలో షాట్లు తీయడం తీవ్రమైన సవాలుతో కూడుకున్న పని అని వెల్లడించారు. `ఒక దర్శకుడిగా నేను కోరుకున్న హావభావాలు.. శరీర కదలికలు రోబోట్ నుంచి రాబట్టడానికి సరైన ప్రాంప్ట్ ఇవ్వడం చాలా క్లిష్టంగా మారింది. అయితే చివరికి స్క్రీన్ మీద వచ్చే అవుట్‌పుట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది` అని ధీమా వ్యక్తం చేశారు. కేవలం పెద్దలకే కాకుండా పిల్లలను సైతం థ్రిల్ చేసేలా సైన్స్ ఫిక్షన్ కథాంశం ఉంటుంది.
నటుడు , రచయిత అనిల్ శెట్టి అందించిన స్క్రిప్ట్ ఈ చిత్రానికి ప్రధాన బలమని, ప్రతి సన్నివేశంలో ఆయన చూపించిన సూక్ష్మ వివరాలు సినిమా స్థాయిని పెంచాయని చిత్ర బృందం పేర్కొంది. బాలీవుడ్ స్టార్ నటుడు కునాల్ కపూర్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. సాచి బింద్రా, మేఘనా గైంకర్ , మాక్ డిసౌజా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విభిన్నమైన నటీనటుల కలయిక .. సాంకేతిక అంశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
సాంప్రదాయ కమర్షియల్ హంగులను దాటి ఆలోచించే వారికి `లాంబోదర 2.0` పర్ఫెక్ట్ టెక్నలాజికల్ ట్రీట్ కానుంది. భవిష్యత్తు సినిమా నిర్మాణంలో ఏఐ .. రోబోటిక్స్ పాత్ర ఏ స్థాయిలో ఉండబోతోందో దిశానిర్దేశం చేస్తూ కన్నడ సినీ పరిశ్రమ వేసిన ముందడుగు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.