కోటి నుంచి 45కోట్లకు... పారితోషికంలో NBK ప్రయాణం!
ఆ రోజుల్లో ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు బాలకృష్ణ కేవలం 1 కోటి నుంచి 2 కోట్ల రేంజులోనే పారితోషికం అందుకోవడం విశేషం.
నటసింహా నందమూరి బాలకృష్ణ పారితోషికం గ్రాఫ్ ఇప్పుడు ప్రధానంగా చర్చల్లోకొచ్చింది. ఆయన తొందర్లోనే 50కోట్ల పారితోషికం క్లబ్ లో చేరబోతున్నారనేది అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతోంది. బాలకృష్ణ బాక్సాఫీస్ ప్రయాణంతో పాటు అతడి పారితోషికం గ్రాఫ్ కూడా ఊహించని స్థాయిలో పుంజుకుంటూ టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త రికార్డులను సృష్టించడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కెరీర్ ప్రయాణం తొలినాళ్ల నుంచి మాస్ హృదయాలను ఏలుతున్న నటసింహం, 90ల చివర్లో `సమరసింహారెడ్డి`,`నరసింహనాయుడు` చిత్రాలతో టాలీవుడ్లో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టారు. ఆ రోజుల్లో ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు బాలకృష్ణ కేవలం 1 కోటి నుంచి 2 కోట్ల రేంజులోనే పారితోషికం అందుకోవడం విశేషం. సమర సింహారెడ్డి చిత్రాన్ని 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 30 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. అయితే నాటి బాక్సాఫీస్ ప్రమాణాలు సినిమా బడ్జెట్ దృష్ట్యా 2 కోట్ల రేంజు పారితోషికం అత్యధికమే. ఇప్పటి లెక్కలతో పోలిస్తే అప్పట్లో పారితోషికాలు చాలా పరిమితమేనని భావించాలి.
సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి సినిమాల తర్వాత కెరీర్లో హెచ్చుతగ్గులు వచ్చినా.. దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన సింహా, లెజెండ్ చిత్రాలు బాలయ్య మార్కెట్‌ను మళ్లీ నిలబెట్టాయి. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన `సింహా` సమయంలో అతడి పారితోషికం 5 కోట్ల మార్కును తాకగా, `లెజెండ్` నాటికి అది రూ. 7 కోట్ల నుంచి రూ. 9 కోట్ల స్థాయికి చేరింది. ఈ విజయాలతో బాలకృష్ణ వ్యాపార పరిధి మరింత పెరిగింది.. ఆయన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఉన్న డిమాండ్ స్పష్టమైంది.
అయితే ఇటీవల వచ్చిన `అఖండ` విజయం బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద మలుపు. `అఖండ` చిత్రానికి 15 కోట్ల వరకు అందుకోగా.. అనంతరం వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి బ్యాక్-టు-బ్యాక్ హిట్లు, బాబీ ప్రాజెక్ట్ నాటికి ఆయన మార్కెట్ రేటును 30 కోట్లకు చేర్చాయి. ఇక పాన్-ఇండియా స్థాయిలో రూపొందిన `అఖండ 2` కోసం ఆయన పారితోషికం 40 కోట్ల రేంజ్‌కు పెరగడం విశేషం.
ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా (NBK112) కోసం బాలకృష్ణ ఏకంగా 45 కోట్ల మేర పారితోషికం అందుకోనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఇది ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో అందుకుంటున్న బిగ్గెస్ట్ చెక్. ఒకప్పుడు 1-2 కోట్లతో ప్రారంభమైన పారితోషికం గ్రాఫ్.. నేడు 45 కోట్లకు చేరుకోవడం ఎన్బీకే బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తోంది. త్వరలోనే ఆయన రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మొత్తానికి `సమరసింహారెడ్డి` రోజుల నాటి పారితోషికంతో పోలిస్తే ఇప్పటి రేంజ్ దాదాపు 40 రెట్లకు పైగా పెరిగింది. వయసుతో సంబంధం లేకుండా వరుస విజయాలతో రీసెంట్ కాంబినేషన్లకు భారీ క్రేజ్ తీసుకువస్తూ రూ. 150 - 200 కోట్ల బడ్జెట్ సినిమాలను కూడా తన భుజస్కంధాలపై నడిపిస్తుండటమే బాలకృష్ణ పారితోషికం ఈ స్థాయిలో ఎగబాకడానికి ప్రధాన కారణం.