రొమాంటిక్ లవ్ స్టోరీలు కొత్తగా ట్రై చేయకపోతే బిగ్ రిస్కే!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రొమాంటిక్ జానర్ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రొమాంటిక్ జానర్ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఒకే రకమైన కథాంశాలతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తిరస్కరించే ప్రమాదం ఉందనేది నిస్సందేహం. ఇటీవల సైయారా సాధించిన అద్భుత విజయం ఇచ్చిన ఉత్సాహంతో యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా బాలీవుడ్‌లో రొమాంటిక్ ఎరాను పునరుద్ధరించాలని భావించడం గొప్ప పరిణామమే అయినా.. అది కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. వైఆర్ఎఫ్ లైనప్‌లోని ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే స్క్రిప్ట్ ఎంపికలో కొత్తదనం- వైవిధ్యం అత్యంత కీలకం. దీనికి మించి రచయితలు నాలుగు గోడల మధ్య కాకుండా, ఒరిజినల్ గా జరిగిన నిజ కథలను సృజించడం ఇప్పుడు అత్యావశ్యకం.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గతంలో వచ్చిన గొప్ప ప్రేమకావ్యాలను పరిశీలిస్తే, దేవదాస్, దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే, గీతాంజలి (తెలుగు), ప్రేమదేశం (కాదల్ దేశం), సైరాథ్, చెలి, ఆషిఖి 2.. ఇలా ప్రతి సినిమా తనదైన ప్రత్యేక నేపథ్యంతో ప్రేక్షకులను మైమరిపించినవే. `దేవదాసు` లాంటి విషాదాంత కావ్యం, `అలయ్ పాయుతే` (సఖి) లోని వివాహానంతర వైరుధ్యాలు లేదా `ముంగారు మళె` వర్షం వెనుక దాగివున్న ప్రేమకథలో వేదన.. `సైరాత్` ప్రతిబింబించిన సామాజిక వాస్తవాలు.. ఇవన్నీ ప్రేమకథలకు భిన్నమైన అనుభూతిని జోడించడం వల్లే ఆల్ టైమ్ క్లాసిక్స్‌గా నిలిచాయి. ఇదే సూత్రాన్ని వైఆర్ఎఫ్ తన తదుపరి కొత్త ప్రేమకథా చిత్రాలకు వర్తింపజేస్తూ.. పాత మూస పద్ధతులకు స్వస్తి చెప్పి దేనికది విలక్షణమైన కథాంశాలతో ముందుకురావాల్సి ఉంది.
ఈ క్రమంలోనే అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అహాన్ పాండే, శార్వరి జంటగా తెరకెక్కుతున్న చిత్రం రొమాన్స్ జానర్‌కు కొత్త కోణాన్ని ఆపాదిస్తుందని అంచనా వేయొచ్చు. కేవలం ఒక సాధారణ ప్రేమకథగా కాకుండా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని ఆశిద్దాం. హింస, నేరప్రపంచం, మ్యూజికల్ రొమాన్స్ కలగలిసిన తీవ్రమైన భావోద్వేగాలను సరిగ్గా ఆవిష్కరిస్తే.. ఇది బాలీవుడ్‌లో సరికొత్త యాక్షన్-రొమాంటిక్ ట్రెండ్‌కు తెరతీసే అవకాశం ఉంది.
మరోవైపు మోహిత్ సూరి - అహాన్ పాండే - అనీత్ పద్దాల కాంబినేషన్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటోందనే సమాచారం ఉంది. కాలేజ్ నేపథ్యంలో చాలా ప్రేమకథలకు భిన్నమైన కథాంశాన్ని ఈసారి వైఆర్ఎఫ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది కచ్ఛితంగా మోహిత్ సూరికి మరో సయ్యారా కాకూడదని ఆశిద్దాం. అలాగే అతడే రూపొందించిన ప్రేమకథా చిత్రాలు ఆషిఖి 2కి భిన్నంగాను ఉండాలి.
మనీష్ శర్మ దర్శకత్వంలో అంబరీష్ వర్మ, సారా అర్జున్‌లతో పంజాబ్ నేపథ్యంలో ఒక రొమాంటిక్ ప్రేమకథను సిద్ధం చేస్తున్నారు. సాధారణ యూత్ ఫుల్ డ్రామాలా కాకుండా నేటి తరం ఆలోచనలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని ఒక అంచనా. మనీష్ శర్మ చిత్రం పంజాబీ మూలాలు, సంస్కృతి.. నాటి-నేటి పీరియడ్ అనుబంధాల ఘర్షణను ఆవిష్కరించేలా ఉండాలి. డిడిఎల్‌జే లోని పంజాబీ ట్రెండ్ నేటి కాలానికి జెన్ జీ ప్రేమాయణాలకు తగినట్లు ఎలా రూపాంతరం చెందిందో ఈ చిత్రం నిరూపించాల్సి ఉంటుంది.
ఇక ఆదిత్య చోప్రా స్వయంగా ప్లాన్ చేస్తున్న భారీ బడ్జెట్ ముక్కోణ ప్రేమకథ 2027 వేసవిలో పట్టాలెక్కనుంది. `బాజీరావ్ మస్తానీ`, `చెలి`, ` ప్రేమదేశం` (తమిళం- కాదల్ దేశం) వంటి చిత్రాలు మక్కోణ ప్రేమకథను ఎంతో గొప్ప హృదయంతో.. ఆర్ద్రతతో చూపించి విజయం సాధించాయి. కాబట్టి వైఆర్ఎఫ్ నుంచి రానున్న తదుపరి నాలుగు ప్రేమకథా చిత్రాలు లేదా రొమాంటిక్ జానర్ సినిమాలు కేవలం గ్లామర్, సంగీతానికే పరిమితం కాకుండా అద్భుత కథనం, క్యారెక్టరైజేషన్, విభిన్న వాతావరణాల పరంగా సరికొత్త అనుభూతిని ఇస్తేనే బాక్సాఫీస్ వద్ద పాత రొమాంటిక్ వైభవంతో పాటు సరికొత్త మ్యాజిక్‌ను పునరావృతం చేయగలవు.