రావణ-జటాయు పోరు వెనుక 6.5 ఏళ్ల చెమట!

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ `రామాయణం` పై రోజూ రకరకాల వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Update: 2026-10-31 15:45 GMT

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ `రామాయణం` పై రోజూ రకరకాల వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక అద్భుతంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ వెల్లడించిన ఓ ఆసక్తికర నిజం విస్మయానికి గురిచేస్తోంది. ఈ చిత్రంలోని రావణుడు - జటాయువు మధ్య జరిగే భీకర పోరాట సన్నివేశం కోసం ఏకంగా ఆరున్నర సంవత్సరాల పాటు శ్రమించినట్లు నితీష్ తివారీ రివీల్ చేసారు.

సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ పట్ల సాధారణ ప్రేక్షకులు కొన్నిసార్లు తేలికగా మాట్లాడి దానిని ఏఐ లేదా సింపుల్ వర్క్‌గా కొట్టిపారేస్తుంటారని కానీ పర్ఫెక్ట్ ఫ్రేమ్ వెనుక వేలాది మంది కళాకారుల చెమటోడ్చే శ్రమ ఉంటుందని నితీష్ తెలిపారు. కేవలం ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆర్టిస్టులకు బ్రీఫింగ్ ఇచ్చిన రోజు నుంచి ఆ వర్క్ పూర్తిగా పూర్తయ్యే నాటికి సరిగ్గా ఆరున్నర సంవత్సరాల సమయం పట్టిందని వివరించారు. ఈ ఒక్క విష‌యం చాలు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతటి నిబద్ధతతో పని చేస్తున్నారో చెప్పడానికి.

అలాగే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన `పుష్పక విమానం` డిజైన్ వెనుక కూడా పెద్ద సాహసమే దాగుంది. పుష్పక విమానం రూపకల్పన కోసమే రెండేళ్ల సమయం కేటాయించారట. విమానం ఎలా ఎగురుతుంది అనే దానిపై కల్పన కాకుండా ఆ కాలంలోనూ ఒక సైన్స్ ఉంటుందనే నమ్మకంతో దానిని రూపుదిద్దినట్లు నితీష్ పేర్కొన్నారు. ఈ విమానం కోసం ఏకంగా 40 నుంచి 50 రకాల డిజైన్లను మార్చి చివరకు అత్యంత ప్రామాణికంగా ఉండే ఒక డిజైన్‌ను ఫైనల్ చేశారట.

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, పాన్ ఇండియా స్టార్ యశ్ రావణాసురుడిగా కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీపడకుండా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. విజువల్స్ కోసం వేలాది మంది టెక్నీషియన్లు పడుతున్న కష్టం సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు. ఇలాంటి భారీ విజువల్ వండర్స్ కోసం దర్శకులు.. టెక్నీషియన్లు సంవత్సరాల తరబడి పడుతున్న ప్రయాసను ప్రేక్షకులు కూడా గుర్తిస్తున్నారని.. సినిమా విడుదలైన తర్వాత విజువల్స్ ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.




Tags:    

Similar News