వారసుడు ఓటిమిని ఒప్పుకున్నట్లేనా?
అయితే దర్శకుడిగా ఎదురైన తొలి ఓటమికి భయపడి సంజయ్ అసలు లక్ష్యమైన దర్శకత్వాన్ని పక్కన పెట్టారా? లేక ఓటమిని ఒప్పుకోవడమేనా?
తమిళ చిత్రపరిశ్రమలో దళపతిగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ వారసుడు జాసన్ సంజయ్ ఎంట్రీపై తొలి నుంచీ సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కెమెరా ముందుకు వచ్చి హీరోగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని అంతా భావించినా? విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసిన సంజయ్ అనూహ్యంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన `సిగ్మా` (Sigma) చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
మొదటి సినిమా `సిగ్మా` బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడం.. ఇటీవల ఓటీటీ విడుదలలోనూ స్క్రీన్‌ప్లే లోపాల వల్ల మిశ్రమ స్పందన తెచ్చుకోవడం జాసన్ సంజయ్ కెరీర్‌కు తొలి అడుగులోనే ఎదురుదెబ్బగా మారింది. విజయ్ కొడుకుగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంజయ్ నుంచి సాలిడ్ హిట్ వస్తుందని ఆశించిన అభిమానులకు ఈ ఫలితం నిరాశనే మిగిల్చింది. అయితే ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని దర్శకుడిగా తదుపరి ప్రాజెక్ట్‌ను మరింత బలంగా సిద్ధం చేస్తాడని భావిస్తే సంజయ్ సరికొత్త దారి ఎంచుకున్నాడు.
కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సంజయ్ సిద్ధమవుతున్నారనే వార్తలు ప్రస్తుతం దక్షిణాది సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడిగా తొలి ప్రయత్నం వికటించడంతో జాసన్ కెరీర్ రూట్‌ను మార్చుకుని తండ్రి బాటలోనే నటుడిగా స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. నటనలో మెరవడానికి ఇది సరైన సమయమని భావించి మంచి కమర్షియల్ ప్రాజెక్ట్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే దర్శకుడిగా ఎదురైన తొలి ఓటమికి భయపడి సంజయ్ అసలు లక్ష్యమైన దర్శకత్వాన్ని పక్కన పెట్టారా? లేక ఓటమిని ఒప్పుకోవడమేనా? అన్న చర్చ సినీ విశ్లేషకుల్లో మొదలైంది. స్టార్ కిడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ విఫలమైనంత మాత్రాన ఇంత త్వరగా ప్రాధాన్యతలను మార్చుకోవడం ఓటమిని ఒప్పుకోవడమే అని కొందరు అభిప్రాయ పడుతుంటే? మరికొందరు మాత్రం దీనిని ఓ తెలివైన స్ట్రాటజీగా చూస్తున్నారు. నటుడిగా తనకంటూ ఓ మార్కెట్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి దర్శకత్వం చేయడం సౌత్‌లో సాధారణమేనని ఉదాహరణలు ఇస్తున్నారు.
విజయ్ వంటి మాస్ ఐకాన్ వారసుడిగా ఉండే బాధ్యతను.. అంచనాలను తట్టుకోవడానికి నటుడిగా మారడమే సులువైన మార్గమని సంజయ్ భావించి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దర్శకుడిగా సాంకేతికతపై సంపూర్ణ పట్టు ఉన్న వ్యక్తి కథానాయకుడిగా మారితే స్క్రీన్ ప్రెజెన్స్, షాట్ సెలెక్షన్ పరంగా అదనపు ప్రయోజనం ఉంటుందనేది మరొక కోణం. ఈ విమర్శలు, విశ్లేషణలను దాటుకుని సంజయ్ హీరోగా ఎలాంటి కథను ఎంచుకుంటాడో చూడాలి.
ఏదేమైనా తొలి అడుగులోనే ఎదురుదెబ్బ తగిలినా? సంజయ్ వెనుకంజ వేయకుండా నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడటం తమిళ సినీ రంగాన్ని ఆకర్షిస్తోంది. దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయినా? నటుడిగానైనా? తండ్రి పేరును నిలబెట్టి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటాడో? లేదో? చూడాలి.