చైల్డ్ ఆర్టిస్ట్ విషయంలో ‘ఇరుముడి’ నిర్మాతలకు లేబర్ డిపార్ట్‌మెంట్ నోటీసులు!

సినిమా ప్రమోషన్లలో బాలనటిని భాగం చేయడంపై ‘ఇరుముడి’ చిత్ర నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

Update: 2026-10-31 16:30 GMT

సినిమా ప్రమోషన్లలో బాలనటిని భాగం చేయడంపై ‘ఇరుముడి’ చిత్ర నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంపై నవంబర్ 4న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నిర్మాతలను అధికారులు ఆదేశించినట్లు సమాచారం.

సినిమా షూటింగ్‌తో పాటు ప్రచార కార్యక్రమాల్లోనూ మైనర్ బాలికను పాల్గొనించాలంటే జిల్లా కలెక్టర్‌ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను చిత్రబృందం పాటించిందా లేదా అన్నది అధికారులు పరిశీలిస్తున్నారు.

అంతేకాకుండా బాలనటి సంపాదించిన పారితోషికంలో 20 శాతాన్ని ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? షూటింగ్, ప్రమోషన్ల సమయంలో ఆమె ఎన్ని గంటలు పనిచేసింది? తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారా? సినిమా పనుల వల్ల ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అనే అంశాలపై వివరాలు కోరినట్లు తెలుస్తోంది.

ఇక్కడ ప్రధానంగా బాలల హక్కులు, వారి ఆర్థిక భద్రత, పని వేళలకు సంబంధించిన నిబంధనల అమలుపై అధికారులు దృష్టి పెట్టారు. బాలనటులను సినిమాల్లో భాగం చేసుకోవడం తప్పు కాదు. అయితే వారి భద్రత, చదువు, భవిష్యత్తుకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతలను నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ కథానాయకుడిగా నటించారు. ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బాలనటి వ్యవహారంతో వార్తల్లో నిలిచింది. అయితే నిర్మాతల నుంచి వచ్చే వివరణతోనే ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News