శీను పిల్లలు ఎందుకు వచ్చారు

Update: 2018-03-09 05:41 GMT
నిన్న రవితేజ హీరోగా దర్శకుడు శీను వైట్ల దర్శకత్వంలో రూపొందబోయే కొత్త సినిమా 'అమర్ అక్బర్ అంటోనీ' షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మిస్టర్ డిజాస్టర్ తర్వాత కొన్నాళ్ళు మాయమయిపోయిన  శీను వైట్ల ఈ సారి పక్కా స్క్రిప్ట్ తో తన మొదటి సినిమా 'నీ కోసం' హీరో రవితేజ కోసం మంచి ఎంటర్ టైనర్ రాసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న వేడుకలో అందరిని ఆకట్టుకున్న అంశం మరొకటి ఉంది. అదే శీను వైట్ల కూతుళ్ళ సందడి. మొదటి కూతురు ఆనంది క్లాప్ కొట్టగా రెండో పాప ఆధ్యా కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఇది గమనించిన అందరు సెంటిమెంట్ ఏమో అనుకున్నారు కాని నిజానికి కారణం వేరట. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాళ్ళకు గౌరవం ఇచ్చే సూచికగా తన ఇద్దరు కూతుళ్ళని ఇందులో పాలు పంచుకునేలా చేసానని అంతే తప్ప సెంటిమెంట్ లాంటి కారణం కాదని క్లారిటీ ఇచ్చేసాడు.

శీను వైట్లకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సినిమా. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ వరసగా దారుణ పరాజయాల నేపధ్యంలో మరో స్టార్ హీరో సినిమా ఇస్తాడా అనే అపనమ్మకం మధ్య రవితేజ ఆఫర్ ఇచ్చాడు. నీ కోసం - వెంకీ - దుబాయ్ శీను లంతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జంట మధ్య సినిమాకు మించి మంచి స్నేహ బంధం ఉంది. శీను వైట్ల మొదటి సినిమా, రవితేజకు సోలో హీరోగా మేజర్ బ్రేక్ ఇచ్చిన సినిమా రెండూ నీ కోసం మూవీనే. అందుకే శీను వైట్ల ఎట్టి పరిస్థితుల్లోను తన కం బ్యాక్ ను గట్టిగా  ఋజువు చేసుకోవాలన్న కసితోనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడని సన్నిహితుల నుంచి సమాచారం.

అను ఇమ్మానియేల్ మొదటిసారి రవితో జోడి కడుతున్న ఈ మూవీలో మాజీ హీరొయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుండగా, సునీల్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నట్టు టాక్. తమన్ మరోసారి మాస్ రాజాకు ట్యూన్స్ ఇస్తున్నాడు. షూటింగ్ అధికశాతం అమెరికాలోనే జరపబోతున్నట్టు తెలిసింది. దసరా కంతా షూటింగ్ పూర్తి చేసే ప్లాన్ లో ఉంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. శీను వైట్ల సతీమణి రూపా వైట్ల కూడా ఈ మధ్య ఆర్గానిక్ మిల్క్ బిజినెస్ లో ప్రవేశించి బాగా విస్తరించే పనిలో ఉన్నారని సమాచారం.

 
Tags:    

Similar News