స్టార్ డైరెక్టర్‌కు సపోర్ట్‌గా STR
ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలాంటి కుదుపులకు గురవుతుందో.. ఎలాంటి మలుపులకు గురవుతుందో ఎవరూ చెప్పలేరు.;
ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలాంటి కుదుపులకు గురవుతుందో.. ఎలాంటి మలుపులకు గురవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు స్టార్ స్టేటస్‌ని ఎంజాయ్ చేసిన వాళ్లు చిన్న తప్పుతో తెరమరుగై పోవచ్చు.. లేదా రాత్రికి రాత్రే మళ్లీ లైమ్ లైట్‌లోకి రావచ్చు. సినీ ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణం. ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నాడో తమిళ స్టార్ డైరెక్టర్. అతడే ఏ.ఆర్. మురుగదాస్.
సామాజిక అంశాలని ప్రధానంశంగా తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో `రమణ` సినిమాని తెరకెక్కించి తమిళ నాట సంచలనం సృష్టించి దర్శకుడిగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు మురుగదాస్. ఆ తరువాత కూడా తన సినిమాల్లో ఏదో ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ సినిమాలు చేశారు. `గజిని`తో బాలీవుడ్‌కు వంద కోట్ల సినిమాని పరిచయం చేసి ఇండియన్ సినిమా మార్కెట్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు.
సూర్యతో గజిని, సెవెంత్ సెన్స్, విజయ్‌తో తుపాకి, కత్తి వంటి బ్లాక్ బస్టర్ హిట్‌లని అందించిన మురుగదాస్ `స్పైడర్` నుంచి రేసులో వెనకబడ్డాడు. దర్బార్, సికందర్, మదరాసి వరకు వరుసగా ఫ్లాపుల్ని ఎదుర్కోంటూ కెరీర్‌లో గడ్డు రోజుల్ని ఫేస్ చేస్తున్నారు. గతంలో తనతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరో ఎదురు చూసేవాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.
వరుస ఫ్లాపులతో కెరీర్ డౌన్ ఫాల్ కావడంతో ఏ స్టార్ హీరో ముందుకు రాని పరిస్థితి. అయితే ఈ టైమ్‌లో తనతో సినిమా చేస్తానని, తనకు అండగా నిలబడుతున్నాడు తమిళ హీరో శింబు ఉరాఫ్ STR. ఒక దశలో బ్లాక్ బస్టర్లని ఇందించిన దర్శకుడు మురుగదాస్‌తో సినిమా చేయడానికి శింబు ఆసక్తిని చూపిస్తున్నాడట. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్‌లో నటిస్తున్న `అసురన్`తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న శింబు వీటి తరువాత మురుగదాస్‌లో ఓ భారీ సినిమా చేయబోతున్నాడని తెలిసింది.
మహేష్‌తో చేసిన `స్పైడర్` నుంచి డిజాస్టర్లని ఎదుర్కొంటున్న మురుగదాస్ ఈ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా మళ్లీ కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సామాజిక అంశాలకు కమర్షియల్ అంశాల్ని జోడించి భారీ బ్లాక్ బస్టర్లని వెండితెరపై ఆవిష్కరించిన మురుగదాస్ .. శింబుతో ఎలాంటి కథని తెరపైకి తీసుకొస్తాడో.. ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తాడో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.