చప్పట్లు కొట్టే సీన్లకు కొదవే లేదు.. `దురంధర్ 2`పై బన్ని రివ్యూ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన `దురంధర్ 2` చిత్రాన్ని వీక్షించిన బన్నీ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని.. ముఖ్యంగా దేశభక్తిని స్టైలిష్‌గా చూపించిన విధానం అద్భుతమని ఆయన కొనియాడారు. సినిమా చూస్తున్నంతసేపు ఎంతో ఎమోషనల్‌గా ఫీలయ్యానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
రణ్‌వీర్ సింగ్‌ను `మై బ్రదర్` (నా సోదరుడు) అని సంబోధిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మన దేశంలో రణ్‌వీర్ సింగ్ వంటి వెర్సటైల్ నటుడు ఉన్నందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ నటన నిప్పు కణికలా ఉందని.. తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని బన్నీ ప్రశంసించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను కూడా అల్లు అర్జున్ ఆకాశానికెత్తారు. ఆదిత్య ధర్ ఈ సినిమాతో బంతిని స్టేడియం దాటించేశారని ..అంటే ఒక భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. మన దేశంలో ఇలాంటి ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఈ సినిమా ఒక `షో రాకర్` అని అభివర్ణించారు. దేశభక్తిని అంతర్జాతీయ స్థాయి మేకింగ్‌తో చూపించారని కొనియాడారు.
సినిమాలోని సాంకేతిక విలువల గురించి ప్రస్తావిస్తూ.. ఇందులో ప్రతి సన్నివేశం ఒక బ్లాస్ట్‌లా ఉందని బన్నీ అన్నారు. ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే సందర్భాలకు సినిమాలో కొదవ లేదని.. టెక్నికల్ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉందని తెలిపారు. అలాగే సీనియర్ నటుడు మాధవన్ గారితో పాటు ఇతర నటీనటులు కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని వారిని పేరుపేరునా అభినందించారు. మొత్తం చిత్ర బృందానికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
చివరగా `దురంధర్ 2` ఒక స్వచ్ఛమైన భారతీయ కథ అని.. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉందని అల్లు అర్జున్ ముగించారు. ముగింపులో `జై హింద్` అంటూ బన్ని చేసిన ఈ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక పాన్ ఇండియా స్టార్ మరొక బాలీవుడ్ స్టార్ సినిమా గురించి ఇంత గొప్పగా స్పందించడం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ఐక్యతకు నిదర్శనమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.