న‌టులు ఇది న‌ట‌న కాదు క‌దా.. సింప్లిసిటీయా? సోషల్ మీడియా స్టంటా?

ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్ పవిత్ర గంగా నది ఘాట్ వద్ద సామాన్య ప్రజల మధ్య నిద్రపోతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

Update: 2026-06-19 11:14 GMT

ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్ పవిత్ర గంగా నది ఘాట్ వద్ద సామాన్య ప్రజల మధ్య నిద్రపోతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి ఆయన అభిమానులు `డౌన్ టు ఎర్త్` అంటూ ప్రశంసలు కురిపిస్తుంటే.. మరోవైపు ఇది కేవలం సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచుకోవడానికి, పబ్లిసిటీ కోసం చేసిన పనేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న పని వెనుక `వ్యూస్`, `లైక్స్` కోసం ఆరాటం ఉంటుందనే విమర్శలు ఉన్నా.. సునీల్ గ్రోవర్ లాంటి ప్రతిభావంతుడైన నటుడు కేవలం ప్రచారం కోసమే ఇలా చేశాడనుకోవడం కొంచెం తొందరపాటే అవుతుంది. బిజీ లైఫ్ నుండి కాస్త ప్రశాంతత కోసమే ఆయన అలా ఒదిగిపోయి ఉండవచ్చు.

నిజానికి చిత్ర పరిశ్రమలో కొందరు సెలబ్రిటీలు ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సాదాసీదాగా ప్రవర్తించి ఆశ్చర్యపరుస్తుంటారు. ఉదాహరణకు కోలీవుడ్ స్టార్ `చియాన్` విక్రమ్ గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడి ఫిలిం జర్నలిస్టుల సమావేశంలో వారికి తనే స్వయంగా కుర్చీలు అందించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. అది క‌చ్చితంగా ప్రచారం కోసం చేసిన పని కాదు. ఎందుకంటే విక్రమ్ కెరీర్ ప్రారంభంలో కేవలం రూ. 1000 పారితోషికంతో ఎన్నో కష్టాలు పడి, దిగువ స్థాయి నుంచి స్వయంకృషితో ఎదిగిన నటుడు. ఆ నేపథ్యమే ఆయనకు ఆ సహజమైన వినయాన్ని ఇచ్చింది. ఇలాంటి ఉన్నతమైన ప్రవర్తన ఉన్నప్పుడు వాటికి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం లేకపోయినా... చూసేవారు స్ఫూర్తిగా తీసుకుని వైరల్ చేస్తుంటారు.

టాలీవుడ్ విషయానికి వస్తే.. మన తెలుగు ఇండస్ట్రీలోనూ సునీల్ గ్రోవర్, విక్రమ్ తరహాలోనే అద్భుతమైన సింప్లిసిటీతో ఆకట్టుకునే స్టార్స్ ఉన్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ విరామాల్లో క్యారవాన్ వదిలేసి... పొలాల్లో చెట్ల కింద సాదాసీదాగా మంచం వేసుకుని పడుకోవడం, సాధారణ రైతులతో కలిసి ముచ్చటించడం అభిమానులకు బాగా తెలుసు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు కూడా షూటింగ్ సెట్స్‌లో లైట్ మెన్‌లతో... తోటి కార్మికులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీరు ఏనాడూ ఈ విషయాలను ప్రచారం కోసం వాడుకోలేదు.

ఇక కోలీవుడ్ లో సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అనే చెప్పాలి. వేల కోట్ల మార్కెట్ ఉన్న ఆయన నిత్యజీవితంలో అత్యంత సాధారణ కాటన్ దుస్తులు ధరిస్తూ... పాత అంబాసిడర్ కార్లోనే ప్రయాణిస్తూ కనిపిస్తుంటారు. ఆయనతో పాటు నటుడు అజిత్ కుమార్ కూడా ఎటువంటి పబ్లిసిటీని ఇష్టపడరు. పబ్లిక్ ఫంక్షన్లకు దూరంగా ఉంటూ... సాధారణ బైక్ రైడర్‌లా దేశ దేశాలు తిరుగుతూ... హోటళ్లలో సామాన్యులతో కలిసి టీ తాగుతూ కనిపిస్తుంటారు. వీరు తమ సింప్లిసిటీని సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం ఎప్పుడూ ప్రదర్శించలేదు.

మరోవైపు బాలీవుడ్‌లో కూడా నానా పటేకర్, పంకజ్ త్రిపాఠి వంటి నటులు స్టార్ హోదా వచ్చినా ఇప్పటికీ తమ సొంత గ్రామాల్లో మట్టి ఇళ్లలోనే ఉంటూ.. వ్యవసాయం చేసుకుంటూ గడుపుతుంటారు. అయితే కొందరు బాలీవుడ్ యువ స్టార్లు మాత్రం కేవలం మీడియా అటెన్షన్ కోసమే ఎయిర్‌పోర్టుల్లోనో.. రోడ్ల పక్కనో పబ్లిసిటీ కోసం సింప్లిసిటీని నటిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా నిజమైన వినయం అనేది నటుడి ప్రవృత్తిలోనే ఉంటుంది. సునీల్ గ్రోవర్ గంగా ఘాట్ వద్ద నిద్రపోవడం వెనుక పబ్లిసిటీ యావ ఉందా లేదా అనేది పక్కన పెడితే.. సమాజంలో సెలబ్రిటీలు చేసే మంచి పనులు.. చూపే వినయం అభిమానులపై సానుకూల ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News