గీతూ బోల్డ్ విజన్.. యష్ ప్యాషన్‌తోనే ఇది సాధ్యమైంది!- కేవీఎన్

దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటివరకు పలువురు అగ్ర నటులతో భారీ ప్రాజెక్టులను నిర్మించింది.

Update: 2026-08-09 05:51 GMT

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ వేడుకకు కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందాన్ని ఆశీర్వదించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెకట్ కె. నారాయణ (కేవీఎన్) మాట్లాడుతూ.. శివరాజ్‌కుమార్ రాక తమకు కొండంత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కేవలం తమ బ్యానర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాలో `టాక్సిక్` ఒక ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని.. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఉన్నతమైన, బోల్డ్ విజన్ వల్లనే ఈ సినిమాను ఇంత అద్భుతంగా, భారీ స్థాయిలో తెరకెక్కించడం సాధ్యమైందని స్పష్టం చేశారు.

దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటివరకు పలువురు అగ్ర నటులతో భారీ ప్రాజెక్టులను నిర్మించింది. యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా కథానాయకుడిగా వచ్చిన `పొగరు` సినిమాతో నిర్మాణం వైపు అడుగులేసిన కేవీఎన్ ఆ తర్వాత గోల్డెన్ స్టార్ గణేష్‌తో `గాలిపట 2` చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది. దళపతి విజయ్ నటించిన కెరీర్‌లోని చివరి చిత్రం `జననాయగన్` (విజయ్ 69) లాంటి ఎంతో క్రేజీ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇటీవ‌లే చిరంజీవి- బాబి కాంబినేష‌న్ సినిమాని ఈ సంస్థ ప్రారంభించింది. ప‌వ‌న్, ఎన్టీఆర్ లాంటి హీరోల‌తో ప‌ని చేయ‌నుంది. అలాగే యష్‌తో నిర్మిస్తున్నతాజా చిత్రం `టాక్సిక్` సినిమా వారి లైనప్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కింది.

టాక్సిక్ ట్రైల‌ర్ వేడుక‌లో కథానాయకుడు యష్ గురించి నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. యష్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ సాధ్యపడేదే కాదని.. ఆయన కేవలం నటుడిగానే కాకుండా ఈ సినిమాకు రైటర్‌గా, నిర్మాణంలో ప్రతి దశలోనూ ఎంతో స‌హ‌క‌రిస్తూ పనిచేశారని చెప్పారు. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారని.. రవి బస్రూర్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు. దేశాల సరిహద్దులు దాటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై భారతీయ సినిమా ఘనతను పెంచేలా ఈ చిత్రాన్ని నిర్మించామ‌ని.. నిర్మాతగా ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మెమొరబుల్ జర్నీ అని పేర్కొన్నారు. కేవీఎన్ నుంచి మునుముందు భారీ చిత్రాలు రానున్న నేప‌థ్యంలో టాక్సిక్ ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

టాక్సిక్ ట్రైల‌ర్ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ నటి హుమా ఖురేషి సినిమాపై తనకున్న నమ్మకాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ``నేను ఎక్కడికి వెళ్లినా ప్రతీ ఒక్కరూ `టాక్సిక్` సినిమా గురించే నన్ను అడుగుతున్నారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మెస్మరైజింగ్‌గా అనిపించింది`` అని వ్యాఖ్యానించారు. రాకింగ్ స్టార్ యష్ ఒక గ్రేట్ యాక్టర్ అని.. ఆయనతో కలిసి పనిచేస్తున్న సమయంలో నటనకు సంబంధించి తాను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. ఇలాంటి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు.

మరో కథానాయిక కియారా అద్వానీ మాట్లాడుతూ.. ఈ సినిమా తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ట్రైలర్ అవుట్‌పుట్ చూశాక నాకు మాటలు రావడం లేదు. ఈ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసిన దర్శకురాలు గీతూ కి, యష్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు! అని చెప్పారు. నా కెరీర్‌ను `బిఫోర్ టాక్సిక్, ఆఫ్టర్ టాక్సిక్` అని చెప్పుకునేలా ఈ సినిమా ఉండబోతోందని అన్నారు. త్వరలోనే ప్రేక్షకులు థియేటర్లలో బిగ్ స్క్రీన్‌పై ఒక ఊహించని విజువల్ మ్యాజిక్‌ను చూస్తారని.. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని కియారా ముగించారు.

Tags:    

Similar News