ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!
| షర్మిలా టాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల వివాహ సమయంలో ఆమె ఇస్లాం స్వీకరించి ఆయేషాగా పేరు మార్చుకోవడం వెనుక అప్పటి కుటుంబ, సామాజిక సంప్రదాయాలే కారణమని కుమార్తె సబా అలీ ఖాన్ వెల్లడించారు. నానమ్మ ఆమోదం కోసం మత మార్పు తప్పనిసరైందని తెలిపారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు మత స్వేచ్ఛనిచ్చారని, ఇంట్లో హిందూ, ఇస్లాం పండుగలను సమానంగా జరుపుకునేవారని చెప్పారు.
బాలీవుడ్ లో అత్యంత ఆకర్షణీయమైన జంటగా నిలిచిన దివంగత క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - నటి షర్మిలా టాగూర్ వివాహం అప్పట్లో ఎంత సంచలనమో తెలిసిందే. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరి వివాహం ఎంత వైభవంగా జరిగిందో? అంతకు మించి ఎన్నో చర్చలకు, వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాహం గురించి వారి కుమార్తె..డిజైనర్ సబా అలీ ఖాన్ పటౌడీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
పెళ్లి సమయంలో షర్మిలా టాగూర్ ఇస్లాం మతాన్ని స్వీకరించి ఆయేషాగా పేరు మార్చుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలను సబా ఇటీవల రివీల్ చేసారు. ఆ కాలంలో ఉన్న సాంప్రదాయాలు, చట్టపరమైన నిబంధనల దృష్ట్యా మార్పు అవసరమైందన్నారు. ఒక ముస్లిం వ్యక్తి వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు అప్పట్లో కుటుంబపరంగా.. వ్యవస్థాపరంగా కొన్ని కఠినమైన ఆచారాలు పాటించాల్సి ఉండేదని వివరించారు.
కుటుంబం ఆమోదం లభించాలన్నా? వివాహం అధికారికంగా గుర్తింపు పొందాలన్నా? మతం మారడం తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందని సబా తెలిపారు. ముఖ్యంగా నానమ్మ ఈ విషయంలో ఎంతో కఠినంగా ఉండేవారని ఆమె ఆమోదం లభించాలంటే మత మార్పు ఒక్కటే మార్గమని వెల్లడించారు. `ఆ కాలంలో మార్పు అన్నది తప్పని పరిస్థితుల్లో జరిగింది తప్ప వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఆ విధంగా జరగకపోతే మా నానమ్మ పెళ్లిని ఏమాత్రం అనుమతించేవారు కాదు` అని సబా గుర్తు చేసుకున్నారు.
అయితే మత మార్పు తల్లి షర్మిలా టాగూర్ నటనా జీవితాన్ని కానీ వ్యక్తిత్వాన్ని కానీ ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉదార స్వభావం గల వ్యక్తి కావడంతో ఆయన ఎప్పుడూ భార్యపై ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. షర్మిలా టాగూర్ వృత్తిగత జీవితాన్ని..గుర్తింపును అలాగే కొనసాగించేలా ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. అలాగే ఇంట్లో పిల్లల పై తల్లిదండ్రులు ఎప్పుడూ మతాన్ని బలవంతంగా రుద్దలేదన్నారు.
ఇంట్లో ఇస్లాంతో పాటు హిందూ పండుగలను కూడా సమానంగా జరుపుకునేవారమని.. ఎవరికి నచ్చిన మార్గాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛను ఆ దంపతులు పూర్తిగా ఇచ్చారని తెలిపారు. నాటి కాలపు కఠినమైన సామాజిక కట్టుబాట్లను దాటుకుని దిగ్గజ జంట సాగించిన ప్రయాణం నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇక సబా పటౌడీ జ్యూలరీ డిజైనింగ్ లో ఎంతో అనుభవం ఉన్నా? కేవలం బిజినెస్ రంగంలోనే రాణిస్తున్నారు. సినిమాలకు మాత్రం ఆమె తొలి నుంచి దూరంగానే ఉన్నారు. కొన్ని చారిత్రాత్మక నేపథ్యం గల సినిమాలకు డిజైనర్ గా పనిచేసే అవకాశాలు వచ్చినా? వద్దనుకున్నారు.