వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?
| మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' నైజాం హక్కుల కోసం దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పోటీపడినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం మైత్రీ సంస్థ రూ.290-300 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 'RRR' హక్కుల ధరను మించి ఈ డీల్ ఉండటం ట్రేడ్‌లో ఆసక్తికరంగా మారింది.
రాజమౌళి సినిమా వస్తుందంటే నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల మధ్య కూడా పోటీ మామూలుగా ఉండదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఆయన సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. గతంలో రాజమౌళి సినిమాల పంపిణీలో దిల్ రాజు కీలకంగా వ్యవహరించారు. భారీ ధర పెట్టి రైట్స్ కొనడంతో పాటు మంచి లాభాలు కూడా అందుకున్నారు. అయితే ఈసారి మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న 'వారణాసి' విషయంలో మాత్రం పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది.
గతంలో 'బాహుబలి' మొదటి భాగం నైజాం హక్కులను దిల్ రాజు దాదాపు రూ.25 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో మంచి లాభాలు వచ్చాయి. అయితే రెండో భాగం హక్కులను మాత్రం ఆయన తీసుకోలేదు. అప్పట్లో సునీల్ నారంగ్ దాదాపు రూ.50 కోట్లకు నైజాం రైట్స్ దక్కించుకున్నారు. మొదటి భాగం కంటే రెట్టింపు ధర కావడంతో దిల్ రాజు ఆ డీల్‌కు దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత 'RRR' విషయంలో దిల్ రాజు మళ్లీ ముందుకొచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆ సినిమా నైజాం హక్కులను భారీ ధరకు తీసుకున్నారు. విడుదల తర్వాత నైజాంలోనే రూ.100 కోట్లకు పైగా షేర్ రావడంతో ఆయనకు మంచి లాభాలు దక్కాయి. దీంతో రాజమౌళి సినిమాల విషయంలో దిల్ రాజుకు మంచి అనుభవం ఉంది. ఇప్పుడు 'వారణాసి' రైట్స్ కోసం కూడా ఆయన పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం ఏకంగా రూ.290 కోట్ల డీల్ కుదిరిందని ప్రచారం జరుగుతోంది. మరికొన్ని రిపోర్ట్స్‌లో ఈ మొత్తం రూ.300 కోట్లుగా ఉంది. దిల్ రాజుతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా పోటీపడినట్లు తెలుస్తోంది. చివరకు మైత్రీ సంస్థే ముందున్నట్లు వార్తలు వస్తున్నా ఈ డీల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రొడక్షన్ లో మంచి సక్సెస్ లు అందుకుంది. ఇప్పుడు ఇతర నిర్మాతల పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంలోనూ భారీ పెట్టుబడులు పెడుతోంది. అయితే 'వారణాసి' డీల్స్ మామూలుగా లేవు. 'RRR' తెలుగు రాష్ట్రాల హక్కులు దాదాపు రూ.225 కోట్లకు అమ్ముడవగా, ఈసారి అంతకంటే రూ.65 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు సమాచారం. ఇంత పెట్టుబడి తిరిగి రావాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వసూళ్లు సాధించాలి.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో 'వారణాసి'పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇతర భాషల్లోనూ భారీ బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.