ఛాన్సిచ్చారు కదా అని అంత మాటనేస్తావా తమ్మూ?
| నిర్మాత ఏక్తా కపూర్ భారతీయ సంస్కృతిని కాపాడుతున్నారని తమన్నా భాటియా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. బోల్డ్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మించే ఏక్తా సంస్కృతి పరిరక్షణ గురించి మాట్లాడటంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ది వాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’లో ఛత్ పూజ సంప్రదాయాలను నిజాయితీగా చూపించారని తమన్నా ప్రశంసించారు.
సిటీ లైఫ్ కి అలవాటు పడి మన మూలాలను మరిచిపోతున్నామా? అన్న ప్రశ్నకు తమన్నా భాటియా ఇచ్చిన సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. తన నిర్మాత ఏక్తా కపూర్ మన సంస్కృతిని పట్టించుకుంటారని.., కాపాడుతున్నారని తమన్నా చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. `ది వాన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` లాంటి రూటెడ్ కథకు తమన్నాను నాయికగా ఎంచుకుని సినిమా తీసినందుకే తమ్మూ ఆ మాట అన్నట్లు కనిపిస్తున్నా.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వాడివేడి చర్చకు కారణమవుతోంది.
భోళా విజన్ తో దూసుకెళ్లే నిర్మాత ఏక్తా గురించి తమన్నా పొగడ్తలు బయటకు రాగానే నెటిజన్ల నుంచి ఘాటు రియాక్షన్లు మొదలయ్యాయి. శ్రుతిమించిన శృంగారం.. బోల్డ్ డ్రామాలు.. డార్క్ ఎమోషన్స్‌తో సినిమాలు, సిరీస్‌లు తీసే ఏక్తా కపూర్ మన సంస్కృతిని కాపాడటమా అంటూ చాలామంది సూటిగా ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు కదా అని మరీ ఇంత మాట అనేస్తారా? అంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండగా.. ఈ కామెంట్లతో ఏక్తా కపూర్ గత ప్రాజెక్టుల చుట్టూ ఉన్న వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
ఒకప్పుడు కుటుంబ విలువలు, సంప్రదాయాల చుట్టూ తిరిగే సీరియళ్లతో ఇంటింటికీ చేరువైన ఏక్తా కపూర్ ఆ తర్వాత ఓటీటీ-సినిమాలలో బోల్డ్ కంటెంట్ వైపు అడుగులు వేశారు. శృంగారం..హద్దులు దాటే సన్నివేశాలు.. డార్క్ థీమ్స్‌నే పెట్టుబడిగా పెట్టిన కొన్ని ప్రాజెక్టుల వల్ల మన సంప్రదాయ విలువలు దెబ్బతిన్నాయన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. సున్నితమైన భావోద్వేగాల కంటే షాకిచ్చే ఎలిమెంట్స్- బోల్డ్ సీన్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో కథల్లో సహజత్వం లోపించిందన్న విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
మరోవైపు ఈ వివాదానికి భిన్నమైన కోణం కూడా కనిపిస్తోంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, ఓటీటీ ప్రపంచంలోని తీవ్ర పోటీని తట్టుకునేందుకే అలాంటి కంటెంట్ ని ఏక్తా ఎంచుకుంటారనే వాదన ఒకటుంది. దానికి తోడు `ది వివాన్` విషయంలో ఛత్ పూజ సంప్రదాయాలను తెరపై నిజాయితీగా చూపించారని.. సెట్‌లో అందరూ నియమ నిష్ఠలు పాటించారని తమన్నా చెప్పారు. ఛత్ పూజ జరుగుతుంటే.. బయట చెప్పులు విడిచారని చెప్పారు. మిగతా పండుగలతో పోలిస్తే తెరపై పెద్దగా కనిపించని ఛత్ పూజకు ఈ సినిమాలో చోటు దక్కడం ప్రత్యేకంగా అనిపించిందని తమన్నా అభిప్రాయపడ్డారు. `ది వివాన్` సక్సెస్ నేపథ్యంలో పార్ట్ 2 ని కూడా చిత్రబృందం ప్రకటించింది.
ఏది ఏమైనా బోల్డ్ కంటెంట్ తో సిరీస్ లు, సినిమాలు తీసే ఏక్తా కపూర్ సంస్కృతి ని ఎలివేట్ చేసే సినిమా చేసారని అర్థమవుతోంది. సినిమాలలో చూపిస్తున్న సంప్రదాయ కోణాన్ని, బోల్డ్ ఆలోచనలు ఉన్న నిర్మాత నుంచి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?.. ఏక్తా కపూర్ పై ప్రజల వాస్తవ అభిప్రాయం మారే ఛాన్సుందా? అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది.