ట్రెండీ టాక్: జాతీయ ఉత్తమ నటి ప్రయోగాలు
| మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన టబు.. తొలిసారి హిందీ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘టన్నెల్ మెన్’ 2023 ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాద రెస్క్యూ ఆపరేషన్ స్ఫూర్తితో తెరకెక్కుతోంది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ... బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ సీనియర్ నటి టబు తన నటనప్రతిభతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కేవలం సినిమాలతోనే కాదు ఇప్పుడు వెబ్ సిరీస్ లతోను నటిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించనున్నారు. జాతీయ ఉత్తమ నటి డిజిటల్ ఆరంగేట్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే....
దశాబ్ధాల కెరీర్ లో టబు చేయని ప్రయోగం లేదు. కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్ గానే కాదు.. ఆర్ట్ సినిమాల్లో పెర్ఫామర్ గాను నిరూపించారు. తెలుగులో కూలీ నెం.1, నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాలతో హృదయాలను గెలుచుకున్న తెలుగమ్మాయి టబు.. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన అద్భుతమైన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక పాత్రలు పోషించారు.
మాచిస్, చాందినీ బార్ చిత్రాలకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డులను అందుకున్నారు. హాలీవుడ్లో `ది నేమ్‌సేక్`, `లైఫ్ ఆఫ్ పై` వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని ఇప్పటికే ఇంగ్లీష్ సిరీస్ `డ్యూన్: ప్రాఫెసీ`లో మెరిశారు. అయితే ఇంతవరకు ఏ వెబ్ సిరీస్ చేయని ఈ సీనియర్ నటి ఇప్పుడు తన తొలి హిందీ ఒరిజినల్ స్ట్రీమింగ్ సిరీస్‌తో ఓటీటీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ - నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న `టన్నెల్ మెన్` వెబ్ సిరీస్‌లో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023 నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు జరిగిన ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్ స్ఫూర్తితో ఈ ఫిక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. భోపాల్ గ్యాస్ విషాదంపై `ది రైల్వే మెన్` వంటి సంచలన సిరీస్‌ను తెరకెక్కించిన షోరన్నర్ శివ్ రావైల్ ఈ ప్రాజెక్ట్‌ను నడిపిస్తుండటం.. వైఆర్ఎఫ్ కంటెంట్ హెడ్ సౌగత ముఖర్జీ పర్యవేక్షణలో రూపొందుతుండటంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సహజంగానే బలమైన ఎమోషన్స్- వాస్తవికత ఉండే కథలను ఎంచుకునే టబు.. ఇలాంటి ఒక మానవీయ కోణం ఉన్న కథతో హిందీ వెబ్ సిరీస్ అరంగేట్రం చేయడం సినీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెండితెరపై టబు ఎన్నో ప్రయోగాలు చేసారు. మక్బూల్, హైదర్, అంధాధున్, అల వైకుంఠపురములో వంటి చిత్రాలలో తన నటన గురించి కూడా చాలా చర్చ సాగింది. ఇటీవల క్రూ, బూత్ బంగ్లా, దృశ్యం ది కన్ క్లూజన్ చిత్రాలలో తన నటన అబ్బురపరిచింది.
టబు నటనలో ఉండే ప్రత్యేకత ఏమిటన్నది తను నటించే ప్రతి సినిమా దేనికదే చెబుతుంది. పెర్ఫామెన్స్ లో విలక్షణత కోసం గొప్ప తపన కనిపిస్తుంది. ఇప్పుడు డిజిటల్ తెరపైనా అలాంటి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతుండటం చర్చగా మారింది.
తదుపరి పూరి స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్, కింగ్ 100 చిత్రాలతోను టబు అలరించనున్నారు. సమాంతరంగా ఓటీటీ ఆరంగేట్రం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ జాతీయ ఉత్తమ నటి డిజిటల్ తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారోననే ఉత్కంఠ ఇప్పుడు మొదలైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానున్న `టన్నెల్ మెన్` టబు కెరీర్లో స్పెషల్ సిరీస్‌గా మారుతుందా? అనేది వేచి చూడాలి.