ఒక ఫ్యాన్‌గర్ల్‌గా వచ్చాను.. యష్‌నే చూస్తూ ఎమోషనల్ అయిన రుక్మిణి!
''రాధికా మేడమ్.. ఐ యామ్ యువర్ హ్యూజ్ ఫ్యాన్, ఐ లవ్ యు" అని అత్యంత హార్ట్ ఫుల్‌నెస్ తో చెప్పడం రుక్మిణి నిజాయితీకి అద్దం పట్టింది.
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా.. క్రియేటివ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ రూపొందించిన ప్రతిష్ఠాత్మక చిత్రం `టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కథానాయిక రుక్మిణి వసంత్ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ ప్రియుల్లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. `సప్త సాగరదాచే ఎల్లో` సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన ఈ కన్నడ బ్యూటీ.. ఎంతటి వినయం - పరిణతితో మాట్లాడారో విశ్లేషిస్తే తనపై అభిమానుల్లో గౌరవం మరింత పెరగడం వెనుక ఉన్న స్పష్టమైన కారణాలు తెలుస్తాయి.
సాధారణంగా పెద్ద ఈవెంట్లలో నటీనటులు కేవలం దర్శకుడు, హీరో లేదా నిర్మాణ సంస్థల గురించే ప్రశంసలు కురిపిస్తుంటారు. కానీ రుక్మిణి వసంత్ ఒక అడుగు ముందుకేసి... తెర వెనుక రాత్రింబవళ్లు శ్రమించిన ప్రొడక్షన్ యూనిట్, కెమెరామెన్, సాంకేతిక బృందానికి వేదికపై నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఒక నటిగా తనకు దక్కిన గుర్తింపునకు కారణం ఈ సాంకేతిక నిపుణుల శ్రమేనని గుర్తించిన తీరు తనలోని సంస్కారాన్ని, ప్రొఫెషనలిజాన్ని చాటిచెప్పింది. ఈ వినయపూర్వక వైఖరే నెటిజన్ల నుండి గొప్ప ప్రశంసలు తెచ్చిపెట్టింది.
మాతృభాషాభిమానాన్ని చాటుకుంటూ సొంత ఊరిలో జరిగిన ఈ వేడుకలో రుక్మిణి కన్నడలోనే మాట్లాడి స్థానిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే రుక్మిణి ఎంత ఉత్సాహంగా మాట్లాడినా వేదిక ముందున్న ఆడియన్స్ నుండి లభించిన స్పందన కాస్త తక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ``మన కన్నడ అమ్మాయి ఇంత చక్కగా మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకులు ఇంకా పెద్ద ఎత్తున కేకలు వేసి ప్రోత్సహించి ఉండాల్సింది`` అంటూ ఇతర భాషా అభిమానులు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం రుక్మిణి విషయంలో వ్యక్తమవుతున్న ప్రజాదరణకు నిదర్శనం. ఇక ఈ వేదికపై యష్ స్టార్‌డమ్ ని కీర్తించిన రుక్మిణి అతడికి అభిమానిని అని తెలిపారు. ఒక ఫ్యాన్‌గర్ల్‌గా వచ్చాను.. సినిమాలో భాగం చేసారు.. అంటూ రుక్మిణి ఎమోషనల్ అయ్యారు.
ఇదే వేదికపై యష్ భార్య, సీనియర్ నటి రాధికా పండిట్‌పై రుక్మిణి చూపించిన ఆప్యాయత అందరినీ కట్టిపడేసింది. ``రాధికా మేడమ్.. ఐ యామ్ యువర్ హ్యూజ్ ఫ్యాన్, ఐ లవ్ యు`` అని అత్యంత హార్ట్ ఫుల్‌నెస్ తో చెప్పడం రుక్మిణి నిజాయితీకి అద్దం పట్టింది. అయితే ఈ వేదికపై లుక్స్ విషయంలో నెటిజన్ల నుండి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. `సప్త సాగరదాచే ఎల్లో`లో చూసిన సహజమైన సింపుల్ అందానికే అలవాటుపడిన ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం వేసుకున్న కాస్త హెవీ మేకప్‌పై చర్చించారు. రుక్మిణికి మేకప్ లేని న్యాచురల్ లుక్కే మరింత మ్యాచ్ అవుతుందని `రుక్కు` అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఏది ఏమైనా..రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ఈ అంతర్జాతీయ స్థాయి డార్క్ యాక్షన్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం రుక్మిణి వసంత్ కెరీర్‌కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలవనుంది. తన సంభాషణ శైలి, వినయం.. తోటి నటీనటులపై ఉన్న గౌరవం తనను కేవలం నటిగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టాయి. పాన్-ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధమవుతున్న `టాక్సిక్` ఈ చిత్రంలో నటీనటులకు మంచి పేరు తేనుందని అంక అంచనా.