దూసుకుపోతున్న కొరియన్ కనకరాజు.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

వరుణ్ తేజ్ హీరోగా, రితిక నాయక్ హీరోయిన్ గా ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

Update: 2026-08-09 07:29 GMT

గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్.. ఇప్పుడు అసలైన సక్సెస్ రుచి చూస్తున్నారు. అటు టికెట్ బుకింగ్స్ లో ఇటు కలెక్షన్స్ లో దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు తన సినీ కెరియర్ లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ అందుకోవడం ఇదే మొదటిసారి. అలా వరుణ్ తేజ్ హీరోగా తొలిసారి ఇండో - కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కొరియన్ కనకరాజు.

వరుణ్ తేజ్ హీరోగా, రితిక నాయక్ హీరోయిన్ గా ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. యు వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి , సాయిబాబా జాగర్లమూడి నిర్మాతలుగా వ్యవహరించారు. ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా విడుదల కాగా.. మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాలలో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించారు.అటు టికెట్స్ పరంగా సోల్డ్ అవుట్ అవుతూ.. బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ నంబర్స్ తో ర్యాంపేజ్ ఆడిస్తోంది ఈ చిత్రం.

ప్రీమియర్ తో పాటు మొదటిరోజు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండవ రోజు కూడా అంతకుమించి జోరు కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ఏకంగా రూ.23.6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మొత్తానికైతే రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ.. త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరే దిశగా అడుగులు వేస్తోంది ఈ చిత్రం.

కొరియన్ కనకరాజు స్టోరీ విషయానికి వస్తే.. కనకరాజు (వరుణ్ తేజ్) ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో పెనుగొండకు చెందిన కుర్రాడు. ఆ ప్రాంతంలో చెక్కభజన బృందాన్ని నడిపిస్తూ ఉంటాడు. మహా కోపిష్టి అయిన అతను తన జోలికి వచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టడు. అయితే ఒక గొడవ తర్వాత అరాచకంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. అప్పుడే అతడికి దెయ్యం పట్టిందని తెలుస్తుంది. కానీ అది కొరియన్ దయ్యం అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు. పెనుగొండలో ఉండే కనకరాజుకు కొరియన్ దెయ్యం పట్టడం ఏంటి? ఇంతకు ఆ దెయ్యం కథ ఏంటి? ఆ దెయ్యం బారి నుంచి కనకరాజు ఎలా తప్పించుకున్నాడు? అనేది మిగతా కథ. వినోదానికి పేరు పడ్డ మేర్లపాక గాంధీ ఈ సినిమాలో తన అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కామెడీ పండే కథ కుదిరితే ట్రెండీ వినోదంతో చెలరేగిపోతాడు అనడానికి ఈ సినిమానే ఉదాహరణ. అలా మరోసారి కొరియన్ కనకరాజు సినిమాతో విజృంభించారు. ఇన్ని రోజులు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News