ఆ రెండు సినిమాలను రీమిక్స్ చేశారా?
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం `లవ్ అండ్ వార్`.
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం `లవ్ అండ్ వార్`. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే తాజాగా రిలీజ్ అయిన అలియాభట్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసింది. భన్సాలీ సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే అద్భుతమైన విజువల్స్ , గ్రాండియర్ ఈ పోస్టర్‌లో కనిపించకపోవడంతో నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అలియా భట్ లుక్ ఏమాత్రం ప్రభావవంతంగా లేదని, పోస్టర్ డిజైన్ చాలా సాధారణంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. భన్సాలీ మార్క్ రాయల్టీ పోస్టర్‌లో లోపించిందంటూ నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్‌పై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే కన్నడ స్టార్ యాష్ నటించి `టాక్సిక్` చిత్రం... గతంలో రణ్‌బీర్ కపూర్ నటించిన డిజాస్టర్ `బాంబే వేల్వెట్` సినిమాల కలయికలా ఉందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. రెట్రో స్టైలింగ్, డార్క్ టోన్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నెటిజన్లు భన్సాలీ గత చిత్రాలను గుర్తుచేస్తూ పోస్టులు పెడుతున్నారు. `గంగూబాయి కతియావాడి`, `పద్మావత్` వంటి చిత్రాల్లో కథానాయికలను ఎంతో అందంగా, పవర్‌ఫుల్‌గా చూపించిన భన్సాలీ ఈసారి అలియా లుక్ విషయంలో పొరపాటు చేశారని కొందరు పేర్కొన్నారు. అలియా హావభావాలు, హెయిర్‌స్టైల్ కూడా అంతగా సరిపోలేదని కామెంట్లు చేస్తున్నారు. కళాత్మక చిత్రాల దర్శకుడి నుంచి ఇంత పేలవమైన పోస్టరా? భన్సాలీ క్రియేటివిటీకి ఏమైందంటూ పోస్టులు పెడుతున్నారు.
సోషల్ మీడియా యుగంలో ఫస్ట్ లుక్ పోస్టర్లకే నెటిజన్ల నుంచి విశ్లేషణలు ఎదురవ్వడం సాధారణమే. అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కొంత నిరాశపరిచినా? భన్సాలీ కథనం, మేకింగ్ థియేటర్లలో ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రమోషన్లలో ఎదురైన ఈ ప్రతికూల స్పందనను అధిగమించేందుకు చిత్రబృందం తదుపరి అప్‌డేట్స్‌తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. టీజర్, ట్రైలర్‌లతో మేకర్స్ విమర్శలకు తగిన సమాధానం ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు.