రాజమౌళి ఆలోచన సరైనదేనా?
| రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ విడుదల వాయిదా పడే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఏప్రిల్ 7న కాకుండా ఆగస్టులో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్గా తన కెరీర్ను మొదలుపెట్టిన రాజమౌళి.. సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాలతో సినిమా దర్శకుడుగా మారారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే మంచి విజయాలను సొంతం చేసుకొని , అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు రాజమౌళి. అలాంటి రాజమౌళి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచ దృష్టిని సారిస్తున్న విషయం తెలిసిందే. అలా బాహుబలి తో మొదలైన ఆయన పాన్ ఇండియా ప్రయాణం.. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. అంతేకాదు ఆస్కార్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ ఒక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేసింది అని చెప్పాలి.
అందరి చూపు వారణాసి పైనే..
ఈ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం పై యావత్తు ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం వారణాసి. గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రేక్షకుడికి మరింత విజువల్ వండర్ అనుభూతిని కలిగించడానికి సినిమా విడుదల తేదీని వాయిదా వేయడానికి అటు రాజమౌళి , ఇటు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
వారణాసి అనుకున్న సమయానికి వస్తుందా?
సాధారణంగా విజువల్ వండర్ గా ప్రేక్షకులు ముందుకు రాబోయే ఏ చిత్రమైనా సరే విఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే యావత్తు ప్రపంచం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమాను ఇంకెంత అద్భుతంగా తీర్చిదిద్దాలో అర్థమవుతుంది. అందుకే ఏప్రిల్ ఏడవ తేదీన విడుదలవుతుందని మొదటిగానే ధ్రువీకరించారు కానీ ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర నిర్మాతలు విడుదల తేదీని ఆగస్టు నెలకు మార్చాలని భావిస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..
రాజమౌళి ప్లాన్ సముచితమేనా?
భారీ వీఎఫ్ఎక్స్ పనుల వల్లే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. సాధారణంగా ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదలయితే అటు హాలిడేస్ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆగస్టు వరకు ఈ సినిమా విడుదలను ఆపివేస్తే అప్పుడు సెలవులు దొరకడం కష్టమే అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి సాధారణంగా ఇంత పెద్ద భారీ చిత్రాలను హాలిడేస్ ను ప్రధానంగా చేసుకొని ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం మంచిదేనా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి చూద్దాం ఇది కేవలం సోషల్ మీడియా రూమర్ గానే మిగిలి పోతుందా? అనుకున్న సమయానికి రాజమౌళి తన సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.