తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!
| ‘హమ్ సాత్-సాత్ హైన్’ షూటింగ్ రోజుల్లో సల్మాన్ ఖాన్ చేసిన అల్లరి తనకు మొదట్లో కోపం తెప్పించేదని నటి సోనాలి బింద్రే గుర్తుచేసుకున్నారు. సహనటులను ఆటపట్టిస్తూ ప్రాంక్స్ చేసేవారని, అయితే ఆయనకు ఎలాంటి దురుద్దేశం ఉండదని తర్వాత అర్థమైందన్నారు. సల్మాన్ది గొప్ప మనసని, ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారని ప్రశంసించారు.
బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాల్లో `హమ్ సాత్-సాత్ హైన్` ఒకటి. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, మోహ్నిష్ బహల్, టబు, సోనాలి బింద్రే, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 1999లో రిలీజ్ అయింది. ఆ ఏడాదే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డు సైతం సృష్టించింది. 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన చిత్రం 81 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా తెర వెనుక జ్ఞాపకాలు సోనాలి బింద్రే గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో సల్మాన్ చిలిపి చేష్టలు మొదట్లో తనకు విపరీతమైన కోపం తెప్పించేవని..అయితే సల్మాన్ పెద్ద మనసు గురించి కాలక్రమేణా అర్థమైందన్నారు.
`కెమెరా ముందు ఎంత పద్ధతిగా? ప్రశాంతంగా కనిపించినా? సెట్స్ వెనుక మాత్రం సల్మాన్ ఖాన్ ఎంతో అల్లరి చేస్తారు. సహనటీనటులను ఆటపట్టించడం..రకరకాల ప్రాంక్స్ చేయడం సల్మాన్ కు అలవాటు. నటినటులంతా సీరియస్ గా సీన్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో కూడా సల్మాన్ ఏదో ఒక జోక్ వేసి ఏకాగ్రతను దెబ్బతీసేవారు.ఆ సమయంలో సల్మాన్ చేసే అతి చేష్టలు చూసి తనకు కోపం వచ్చేది. అసలు ఈయనతో షూటింగ్ ఎలా పూర్తి చేయాలనేలా టెన్షన్ ఉండేది.
కానీ ఆ అల్లరి వెనుక ఎలాంటి దురుద్దేశం ఉండదని తోటి నటులను సరదాగా ఉంచడమే సల్మాన్ ఉద్దేశమని తర్వాత అర్దమైంద`న్నారు. అయితే ఎంత అల్లరి చేసినా? సల్మాన్ ఖాన్ మనసు మాత్రం చాలా గొప్పదన్నారు. తోటి వారికి సహాయం చేయడంలో సల్మాన్ ఎప్పుడూ ముందుంటారని సోనాలి బింద్రే కొనియాడారు. సల్మాన్ లో ఆ విశాల హృదయమే అందరికీ ఇష్టమైన నటుడిగా మార్చిందన్నారు. ఆ రోజుల్లో జరిగిన మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ తన హృదయంలో పదిలంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ జ్ఞాపకాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
`హమ్ సాత్-సాత్ హైన్` చిత్రానికి సంబంధించిన బిహైండ్-ది-సీన్ ముచ్చట్లు విని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక సోనాలి బింద్రే సినిమాల విషయానికి వస్తే గత ఏడాది `బీ హ్యాపీ` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్ట్ కు కమిట్ అవ్వలేదు. ప్రస్తుతం సీనియర్ తారలకు అవకాశాలు తగ్గిన నేపత్యంలో సోనాలి బింద్రే కి కూడా అరుదు గానే సినిమా ఛాన్సులు వస్తున్నాయి.