'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు
| త్రిగుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జంగా’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో త్రిగుణ్ గుబురు గడ్డం, రఫ్ లుక్‌తో విభిన్న అవతారంలో కనిపించగా, చీరకట్టులో తుపాకీతో వరలక్ష్మి ఎంట్రీ ఆకట్టుకుంది. మనిషి మనస్తత్వం, ఆధ్యాత్మికత, జీవితం, మరణం చుట్టూ సాగే కథపై గ్లింప్స్ ఆసక్తి పెంచుతోంది. కెవిన్ గడ్డం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఎప్పుడూ ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకునే యంగ్ హీరో త్రిగుణ్, ఈసారి పూర్తిగా ఊహించని అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్రిగుణ్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జంగా. కెవిన్ గడ్డం (శ్రీహరి) రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.
గంగ ఒడ్డున సాయంత్రపు ఘాట్ల విజువల్స్ తో మొదలైన గ్లింప్స్, ఆ వెంటనే మిస్టరీ వాతావరణంలోకి తీసుకెళ్తుంది. చీకటి గుహల్లో దివిటీలతో నడిచే మనుషులు, పాతకాలపు ఇంట్లో పేలుడు లాంటి షాట్లు చూస్తుంటే కథలో సీరియస్ ఎలిమెంట్స్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక ఇందులో త్రిగుణ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. గుబురు గడ్డం, చిందరవందరగా ఉన్న జుట్టుతో, నోట్లో మందు బాటిల్ పెట్టుకుని సైకిల్ తొక్కుతూ కనిపించిన తీరు రొటీన్ హీరోయిజానికి పూర్తి భిన్నంగా ఉంది.
శ్మశానంలో చితి మంటల పక్కన కూర్చున్న సన్నివేశం ఉహించని విధంగా ఉంది. ఈ గ్లింప్స్ లో డైలాగ్స్ కూడా కథ వెనుక ఉన్న బలమైన ఎమోషన్ ను చెబుతున్నాయి. పశువు మనిషి అవ్వడానికి కొన్ని లక్షల ఏళ్లు పట్టిందని, మళ్లీ పశువు అవుతానంటే తాను ఒప్పుకోనని.. వినిపించే వాయిస్ ఓవర్ ఆలోచింపజేస్తుంది. చివర్లో సమాధి దగ్గర కూర్చుని, మనిషి మళ్లీ పశువుగా మారితే చావే మేలనే అర్థం వచ్చేలా త్రిగుణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
ప్రేమ రగిలినప్పుడు శివుడు మేల్కొంటాడనే ట్యాగ్ లైన్ కథపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. మరోవైపు ఈ వీడియోలో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీ కూడా సర్ ప్రైజ్ ఇచ్చింది. సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తూనే, ఏమాత్రం తడబాటు లేకుండా ఎదుటివారిపై తుపాకీ గురిపెట్టి కాల్చే షాట్ పవర్ ఫుల్ గా కుదిరింది. దర్శకుడు కెవిన్ గడ్డం రెగ్యులర్ కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా, మనిషి మనస్తత్వం, ఆధ్యాత్మిక అంశాలు, జీవితం, మరణం మధ్య ఉండే లోతైన ఎమోషన్స్ ను ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
టెక్నికల్ వర్క్ కూడా హైలెట్ అవుతోంది. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని, రా విజువల్స్ ను బాగానే హైలెట్ చేసింది. కృష్ణ సౌరభ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కంటెంట్ కు సరిపోయింది. శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్ కే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర నిమిషం నిడివితోనే జంగా చిత్రబృందం సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగలిగింది. అతిగా హడావుడి లేకుండా, పాత్రల తీరుపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడంలో ఈ గ్లింప్స్ క్లిక్కయ్యింది. మరి ఈ విభిన్నమైన కథ వెండితెరపై ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.