'సిగ్మా' కూడా 'ఇరుముడి'లా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి: మెగాస్టార్ చిరంజీవి
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సిగ్మా` (SIGMA) ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సిగ్మా` (SIGMA) ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షులలో అంచనాలను పెంచిన ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా, ఎస్. థమన్ సంగీతం అందించారు. అలాగే మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి తన ఉత్సాహంతో అందరినీ ఆకట్టుకున్నారు. కథానాయిక ఫరియా అబ్దుల్లాతో కలిసి స్టేజ్‌పై వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్స్ కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచాయి. ఇక సందీప్ కిషన్‌ను కొనియాడుతూ.. తన కెరీర్ తొలి రోజులను ఆయన గుర్తుకు తెస్తారని..ప్రతీసారీ ఒక కొత్తదనం ఉన్న కథలను ఎంచుకునే సందీప్ తపన ఎంతో అభినందనీయమని మెగాస్టార్ ప్రశంసించారు.
జేసన్ సంజయ్ తాతగారు .. విజయ్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి.. జెన్-జెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రం పర్ఫెక్ట్ ఆల్-రౌండ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని కితాబిచ్చారు. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన `ఇరుముడి` సినిమా మాదిరిగానే `సిగ్మా` కూడా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం అందరికీ ఘన విజయాన్ని అందించాలని కోరుకున్నారు.
ఈ వేడుకలో డెబ్యూ డైరెక్టర్ జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. `సిగ్మా` చిత్రంలో బలమైన కోర్ ఎమోషన్‌తో పాటు వినోదం, యాక్షన్ అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. ఈ కథకు హీరో సందీప్ కిషన్ సరైన ఎంపిక అని.. తాను ఊహించిన దానికంటే అద్భుతంగా నటించి ప్రాణం పోశారని ప్రశంసించారు. సినిమాలోని ప్రతి ఎమోషనల్ పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
హీరో సందీప్ కిషన్ భావోద్వేగంతో మాట్లాడుతూ.. తన ఆన్-స్క్రీన్ .. రియల్ లైఫ్ స్ఫూర్తి అయిన మెగాస్టార్ ఈ వేదికపై అతిథిగా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తన 16 ఏళ్ల సినీ ప్రయాణంలో `సిగ్మా` లాంటి అడ్రినైన్ రషింగ్ స్క్రిప్ట్ దొరకడం తన కెరీర్‌కు మైలురాయి నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.
సిగ్మా ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్, మైత్రి మూవీ మేకర్స్-డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు, ఎస్.ఏ చంద్రశేఖర్, చిత్ర యూనిట్‌లోని పలువురు నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
దాదాపు 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది రవితేజ `ఇరుముడి`. ఆ స్థాయి విజయం సాధించాలని జేసన్ సంజయ్ మొదటి సినిమాకి చిరు బ్లెస్సింగ్స్ అందించారు. చిరు ఆశీస్సులు సరే కానీ, ఇప్పుడు మెగాభిమానులు కూడా జేసన్ కి అండగా నిలిచి సిగ్మా చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారేమో వేచి చూడాలి.