క్యారెక్టర్ లేని వాళ్లను దూరంగానే ఉంచాలి!
ప్రేమ, స్నేహం, కుటుంబం లేదా ఉద్యోగం చేసే చోట.. ఎక్కడైనా సరే నమ్మకద్రోహానికి ఒడిగట్టే వ్యక్తులకు జీవితంలో స్థానం ఉండకూడదని పునరుద్ఘాటించారు.
మానవ సంబంధాలలో నమ్మకం, ఆత్మగౌరవం అత్యంత కీలకమైనవని.. క్యారెక్టర్ (ప్రవర్తనా శైలి) సరిగ్గా లేని వారిని, స్వార్థపరులను ఎల్లప్పుడూ దూరంగానే ఉంచాలని నటి కాజల్ అగర్వాల్ అభిప్రాయప్డారు. చిత్ర పరిశ్రమలో దశాబ్దానికి పైగా అగ్ర కథానాయికగా వెలిగిన అమ్మడు వ్యక్తిగత జీవితంలోనూ పరిణతి సాధించిన కాజల్ సంబంధాలు , మానసిక ప్రశాంతతపై చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ, స్నేహం, కుటుంబం లేదా ఉద్యోగం చేసే చోట.. ఎక్కడైనా సరే నమ్మకద్రోహానికి ఒడిగట్టే వ్యక్తులకు జీవితంలో స్థానం ఉండకూడదని పునరుద్ఘాటించారు.
బంధాలన్నింటికీ పునాది నమ్మకమేనని, ఆ నమ్మకం ఒకసారి ఒమ్మయితే మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం అసాధ్యమని కాజల్ అభిప్రాయపడ్డారు. మన ప్రాణ స్నేహితులైనా? ప్రేమించిన వారైనా లేదా పని చేసే చోట సహచరులైనా సరే.. స్వార్థ పూరిత ఆలోచనలతో నమ్మకాన్ని తుంగలో తొక్కే వారితో కలిసి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. పైకి నవ్వుతూ లోపల స్వార్థాన్ని దాచుకునే వ్యక్తులను గుర్తించి, వారికి తగిన దూరంలో ఉండటమే శ్రీరామరక్ష అన్నారు.
కేవలం తమ స్వార్థం, అవసరాల కోసమే సంబంధాలను వాడుకునే మానసిక తత్వం ఉన్నవారు ప్రతి రంగంలోనూ ఉంటారని కాజల్ వ్యాఖ్యానించారు. అలాంటి వారు మన బలహీనతలను ఆసరాగా చేసుకుని, అవసరం తీరాక వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎవరినైనా మన జీవితంలోకి లేదా వ్యక్తిగత పరిధిలోకి ఆహ్వానించే ముందు వారి క్యారెక్టర్, ఆలోచనా ధోరణిని గమనించడం ఎంతో అవసరమని ఆమె సూచించారు.
ముఖ్యంగా పని చేసే ప్రదేశాల్లో వృత్తిపరమైన సరిహద్దులు కాపాడుకోవడం ముఖ్యమని కాజల్ పేర్కొన్నారు. పని చేసే చోట అసూయ, స్వార్థం, వెన్నుపోటు పొడిచే మనస్తత్వాలు ఉన్నవారిని ఎంత దూరంగా ఉంచితే కెరీర్‌కు, మానసిక ఆరోగ్యానికి అంత మంచిదన్నారు. విషపూరితమైన వాతావరణం లేదా వ్యక్తుల నుంచి వెంటనే బయటకు రావడం లేదా వారిని దూరంగా పెట్టడం ద్వారా మాత్రమే పనిపై సరిగ్గా దృష్టి పెట్టగలమని అభిప్రాయపడ్డారు.
సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన కాజల్ అగర్వాల్, వివాహం తర్వాత తల్లిగా మారాక జీవితం పట్ల దృక్పథం మరింత స్పష్టంగా మారిందని తెలిపారు. అనుభవంతో వచ్చే పరిణతి వల్ల జీవితంలో ఎవరికి ఎంతవరకు స్థానం ఇవ్వాలో అర్థమవుతుందన్నారు. ఆత్మగౌరవంతో బతకడం, అనవసరమైన డ్రామాలకు చోటు ఇవ్వకుండా ప్రశాంతంగా జీవించడమే మొదటి ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఈ సూత్రాన్ని పాటించాలని కోరారు.
రూపానికో? హోదాకో? విలువ ఇవ్వడం కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన వివేకమని కాజల్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. నకిలీ సంబంధాలు, స్వార్థపూరిత వ్యక్తులను మోస్తూ కాలం వృథా చేసుకోవడం కంటే మనల్ని గౌరవించే నమ్మకమైన వ్యక్తులతోనే మన సమయాన్ని పంచుకోవడం శ్రేయస్కరమని పిలుపు నిచ్చారు. నిజంగా ఈ వ్యాఖ్యలు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ గొప్ప మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.