3 రోజుల్లోనే లాభాల బాట పట్టిన కొరియన్ కనకరాజు.. బాక్సాఫీస్ వద్ద మాస్ ర్యాంపేజ్
మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 23.6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కేవలం మూడు రోజుల్లోనే క్లీన్ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది.
మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి నాగబాబు లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన 'హ్యాండ్స్ అప్' అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ను ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత ముకుందా సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ఆ తర్వాత కంచె, తొలిప్రేమ, ఫిదా, అంతరిక్షం ఇలా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ వరుస చిత్రాలు చేస్తున్నారు కానీ బ్లాక్ బాస్టర్ రేంజ్ లో ఈమధ్య కాలంలో ఆయన కెరియర్లో ఒక్క మూవీ కూడా పడలేదు అనే చెప్పాలి.
ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను వివాహం చేసుకొని.. ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చిన వరుణ్ తేజ్.. కొడుకు పుట్టాక ఆయన కెరియర్లో హిట్ తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలనుకున్న వరుణ్ తేజ్.. ఏకంగా జానర్నే మార్చేశారు. ఇండో కొరియన్ నేపథ్యంలో కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో కొరియన్ కనకరాజు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా మిరాయ్ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించిన బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా, ప్రముఖ కమెడియన్ సత్య కీలకపాత్ర పోషిస్తూ ఆగస్టు ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 6వ తేదీనే రెండు తెలుగు రాష్ట్రాలలో పెయిడ్ ప్రీమియర్ తో ప్రారంభించిన ఈ షో మొదటి షో తోనే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా 125 షోలు ప్లాన్ చేయగా.. అందులో 100 థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడడం గమనార్హం. ఇక రోజు రోజుకి టికెట్ బుకింగ్స్ పెరుగుతుండడం, కలెక్షన్లు కూడా భారీగా లభించాయి. ముఖ్యంగా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం చూసి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను యాడ్ చేయడంతో పాటు అదనపు షోలను కూడా జోడిస్తున్నారు.
మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 23.6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కేవలం మూడు రోజుల్లోనే క్లీన్ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. రెండవ రోజు శనివారం, మూడవ రోజు ఆదివారం కావడంతో బుకింగ్ లు కూడా భారీగా జరిగాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల నుండి ఈ చిత్రానికి ఏకగ్రీవంగా సానుకూల స్పందన లభిస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా ఆరేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇంతటి సార్వత్రిక ఆదరణ సాధించడం వరుణ్ తేజ్ కి ఒక అద్భుతమైన విజయం అనే చెప్పాలి.
బోనాల పండుగ సందర్భంగా సోమవారం కూడా తెలంగాణ రాష్ట్రంలో సెలవు కావడంతో ఈ సినిమా వరుణ్ కెరియర్ లోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పవచ్చు. యు వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సుమారుగా రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరబోతోంది అని చెప్పవచ్చు.