స్నేహితుడి మ‌ర‌ణంతో మారిన హీరో జీవితం!

రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖీ దారుణ హత్యకు గురికావడం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Update: 2026-06-19 13:30 GMT

రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖీ దారుణ హత్యకు గురికావడం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇద్ద‌రి మధ్య ఉన్నది కేవలం పరిచయం మాత్రమే కాదు. దశాబ్దాల నాటి విడదీయరాని కుటుంబ బంధం. అంత‌కు మించి వ్య‌క్తిగ‌తంతో ఇద్ద‌రు గొప్ప స్నేహితులు. బాబా సిద్దిఖీ మరణవార్త విన్న వెంటనే సల్మాన్ ఖాన్ షూటింగ్‌లను రద్దు చేసుకుని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో స‌ల్మాన్ ముఖంలో కనిపించిన ఆవేదన, కన్నీళ్లు సల్మాన్‌ను ఈ విషాదం ఎంతగా కృంగదీసిందో ఆనాడే బ‌య‌ట ప‌డింది. ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ వ్యక్తిగత.. వృత్తిపరమైన జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.

బాబా సిద్దిఖీ బాలీవుడ్‌లో ఒక రకమైన వారధిలా ఉండేవారు. ప్రతి ఏటా ఆయన ఇచ్చే గ్రాండ్ ఇఫ్తార్ విందులు పరిశ్రమలో ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్- షారుఖ్ ఖాన్ మధ్య ఉన్న సుదీర్ఘ విభేదాలను తొలగించి, ఇద్దరినీ ఒకే వేదికపైకి తెచ్చి కౌగిలింతతో మళ్లీ స్నేహితులుగా మార్చింది బాబా సిద్దిఖీనే. సల్మాన్ ఖాన్ కుటుంబానికి బాబా పెద్ద దిక్కులా ఉండేవారు. ఆపదలో ఆదుకునే ఆప్తుడిగా నిలిచేవారు. అలాంటి వ్యక్తి హఠాన్మరణం సల్మాన్‌కు తీరని వ్యక్తిగత లోటును మిగిల్చగా.. మరోవైపు మానసికంగా కోలుకోలేని దెబ్బ తీసింది.

బాబా సిద్దిఖీ మరణం తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతా వలయం పూర్తిగా మారిపోయింది. హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించడం ..సల్మాన్ ఖాన్‌ను తదుపరి లక్ష్యంగా హెచ్చరించడంతో ప్రభుత్వం ఆయనకు వై-ప్లస్ కేటగిరీ భద్రతను మరింత కఠినతరం చేసింది. సల్మాన్ ఇప్పుడు మునుపటిలా స్వేచ్ఛగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన ప్రయాణించే వాహ‌నాలు.. ఉండే నివాసం చుట్టూ నిరంతరం సాయుధ బలగాలు, కమాండోలు పహారాలో ఉన్నాయి . బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు.. ముందస్తు నిఘా చర్యల మధ్యే స‌ల్మాన్ ప్రతి రోజూ గడపాల్సి వస్తోంది.

ఈ భద్రతా ఆంక్షలు సల్మాన్ ఖాన్ సాధారణ జీవనశైలిని.. ఆయన స్వభావాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎప్పుడూ అభిమానులతో ఉత్సాహంగా గడిపే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ బాల్కనీలో నిలబడి చేతులూపే సల్మాన్ ఖాన్ ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం అరుదుగా మారింది. తన సన్నిహితులను, స్నేహితులను కలవడానికి కూడా కఠినమైన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. నిత్యం ప్రమాదం పొంచి ఉందనే భావన స‌ల్మాన్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మునుపటి చిరునవ్వు.. ఉల్లాసం స్థానంలో ఒక రకమైన గంభీరత్వం, ఆందోళన చోటు చేసుకున్నాయి.

వ్యక్తిగతంగా ఇంతటి వేదన.. ప్రాణాపాయం ఉన్నప్పటికీ సల్మాన్ ఖాన్ వృత్తిపరమైన బాధ్యతలను మాత్రం విస్మరిం చలేదు. అయితే ఈ షూటింగ్ సెట్స్ అన్నీ ఇప్పుడు హై-సెక్యూరిటీ జోన్లుగా మారిపోయాయి. భారీ భద్రత నడుమ, కఠినమైన తనిఖీల తర్వాతే ఎవరినైనా సెట్ లోపలికి అనుమతిస్తున్నారు. భయం నీడలోనే పనిని పూర్తి చేస్తూ వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుకుంటున్నారు. మానసిక ఒత్తిడి మాత్రం స‌ల్మాన్ ఖాన్ ని నిత్యం వెంటాడుతూనే ఉంది.

బాబా సిద్దిఖీ మరణం సల్మాన్ ఖాన్ జీవితంలో ఒక ముగింపు రేఖను.. ఓ కొత్త కఠిన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక ఆప్తుడిని కోల్పోవడమే కాదు. సల్మాన్ స్వేచ్ఛను.. ప్రశాంతతను దూరం చేసిన సంఘటన ఇది. సూపర్ స్టార్‌గా వెలుగుతున్నా? నిత్యం భద్రతా వలయంలో బందీగా బతకాల్సి రావడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత నిశ్శబ్దంగా మార్చేసింది. ఈ పెను విషాదం తదానంతర పరిణామాలు సల్మాన్ ఖాన్‌ను మునుపటి కంటే జాగ్రత్తగా.. ఆలోచనాత్మకంగా ఉండేలా మార్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News