రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట
| తెలుగు సినిమా ఇండస్ట్రీపై రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకే కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీపై రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకే కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల తర్వాత ఓ సినిమా గురించి అంత నెగటివ్‌గా మాట్లాడటమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ స్టార్ హీరో అభిమానులు మరో అడుగు ముందుకేశారు. గతంలో అదే సినిమా గురించి రాధికా ఎంత పాజిటివ్‌గా మాట్లాడారో చూపిస్తూ పాత వీడియోలను బయటకు తీస్తున్నారు. అప్పటి మాటలను, ఇప్పటి కామెంట్స్‌ను పోలుస్తూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'అక్క' ప్రమోషన్లలో భాగంగా కీర్తి సురేష్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా తన కెరీర్లో అత్యంత కష్టంగా అనిపించిన పాత్ర గురించి మాట్లాడారు. ఓ తెలుగు సినిమాలో మేనమామను పెళ్లి చేసుకునే పాత్ర చేయాల్సి వచ్చిందని చెప్పారు. తనకంటే చాలా పెద్ద వయసున్న హీరోతో రొమాన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందని, ఆ సినిమాలో తనకు ఏదీ నచ్చలేదని అన్నారు. సినిమా మధ్యలోనే తన పాత్ర చనిపోవడం, ఆ తర్వాత హీరో యాక్షన్ సన్నివేశాలు చేయడాన్ని కూడా ప్రస్తావించారు.
అయితే పాత వీడియోలో రాధికా మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆ సినిమాలో భాగమైనందుకు ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నట్లు అప్పట్లో చెప్పారు. ఇప్పుడు అదే సినిమా గురించి అంత నెగటివ్‌గా మాట్లాడటంతో సదరు హీరో అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అంతగా మెచ్చుకుని ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు ఆమె మాటలు ఊసరవెల్లిలా మారుతున్నాయని కూడా విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా ఆ హీరోతో రాధికా ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. ఆ తర్వాత ఏడాదే మరో సినిమాలో కూడా కలిసి నటించారు. మొదటి సినిమా విషయంలో అంత అసంతృప్తి ఉంటే మరోసారి అదే హీరోతో ఎందుకు పనిచేశారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే అప్పట్లో సినిమా అవకాశం దక్కినందుకు కృతజ్ఞత చెప్పడం, ఇప్పుడు పాత్రలోని అంశాలు నచ్చలేదని చెప్పడం రెండూ వేర్వేరు విషయాలే. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఆమె వ్యాఖ్యల్లో వచ్చిన మార్పునే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.
గతంలో తాప్సీ కూడా తెలుగు సినిమాల్లో తన అనుభవాలపై చేసిన కామెంట్స్‌తో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాధికా విషయంలోనూ దాదాపు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఈసారి అభిమానులు కేవలం కామెంట్స్‌తో సరిపెట్టకుండా పాత వీడియోలను కూడా బయటకు తీస్తున్నారు. అప్పటి ప్రశంసలు, ఇప్పటి విమర్శలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఆమె పాత ఇంటర్వ్యూలు కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు రాధికా లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా పేరు డైరెక్ట్ గా చెప్పలేదు. కానీ ఆమె వివరించిన సన్నివేశాల ఆధారంగా అభిమానులు ఆ చిత్రాన్ని గుర్తించారు. అయితే మేనమామతో పెళ్లి అని ఆమె చెప్పిన బంధుత్వంపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. సినిమాలో ఆమె పాత్రకు హీరో బావ అవుతారని, మేనమామ కాదని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఇలా ఒకే ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌తో రాధికా గతంలో చెప్పిన మాటలు, నటించిన సినిమాలు మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చాయి.