గుసగుస: బాక్సాఫీస్ వేటలో వందల కోట్లు ఆశిస్తున్న పుస్తక రచయిత!
బాలీవుడ్ అవార్డ్ విన్నింగ్ మహిళా దర్శకురాలు, రచయిత్రి మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `దాయరా` థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైంది.
బాలీవుడ్ అవార్డ్ విన్నింగ్ మహిళా దర్శకురాలు, రచయిత్రి మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `దాయరా` థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైంది. ఈ హై-ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని 18 సెప్టెంబర్ 2026న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ఖాన్ పోలీస్ అధికారులుగా నటిస్తున్న ఈ చిత్రం.. ఒకే ఒక్క ఘోరమైన ఘటన సమాజంలో ఎలాంటి విభిన్న ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది... నేరం-నిర్దోషిత్వం మధ్య సన్నని గీతలను ఎలా మసకబారుస్తుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోంది. నిజమైన సామాజిక సమస్యల ఆధారంగా అద్భుతమైన పుస్తకాలు రచించిన ఒక గొప్ప సాహితీవేత్త అయిన మేఘన, ఇప్పుడు కమర్షియల్ బాక్సాఫీస్ విజయం కోసం ఇలాంటి క్రైమ్ జానర్‌ను ఎంచుకోవడం చిత్ర పరిశ్రమలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేషన్ స్టోరీలు తెరకెక్కించడంలో గౌతమ్ మీనన్, రాజ్‌కుమార్ పెరియాసామి, లోకేష్ కనగరాజ్ వంటి స్పెషలిస్ట్ డైరెక్టర్లు సౌత్‌లో ఉన్నారు. అలాగే జీతూ జోసెఫ్ తెరకెక్కించిన `దృశ్యం` ఫ్రాంచైజీ ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఈ జానర్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. హిందీ, సౌత్ సినిమాల్లో ఎందరో దిగ్దర్శకులు క్రైమ్ థ్రిల్లర్లతో వందల కోట్లు ఆర్జిస్తున్న తరుణంలో మేఘనా గుల్జార్ తన విలక్షణమైన మేకింగ్ శైలితో వీరిని మించి మెప్పిస్తారా? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఫరా ఖాన్, గీతూ మోహన్ దాస్ వంటి మహిళా దర్శకులు కమర్షియల్ పంథాలో సినిమాలు తీసి మెప్పించగా, ఇప్పుడు మేఘన కూడా అదే బాట పట్టారు. ఈ పుస్తక రచయిత ఎంచుకున్న సబ్జెక్ట్ `టాక్సిక్` లాంటి ప్యూర్ యాక్షన్ సినిమా కాకపోయినా... బిజినెస్ పరంగా దేశవ్యాప్తంగా మంచి సెల్లింగ్ పాయింట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ కావడం గమనార్హం.
ఈ మార్పు వెనుక మేఘనా గుల్జార్ గత చిత్రాల కమర్షియల్ ఫలితాలే ప్రధాన కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మేఘన గతంలో `తల్వార్` (ఆరుషి హత్య కేసు ఆధారంగా), `ఛపాక్` (యాసిడ్ దాడి బాధితురాలి కథ), సామ్ మానెక్‌షా జీవిత కథ ఆధారంగా `సామ్ బహదూర్` వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ సినిమాలు కంటెంట్ పరంగా, క్లాసిక్ మేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ మైలేజ్ ఇవ్వలేకపోయాయి. కేవలం ఆలియా భట్‌తో తీసిన `రాజీ` (రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు) మినహా మేఘనా మిగతా చిత్రాలేవీ కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ పరాజయాల ద్వారా సినిమా అనే మాధ్యమం కేవలం సామాజిక సేవ కోసమే కాదని... కమర్షియాలిటీ కూడా అంతే ముఖ్యమని మేఘనకు ఆలస్యంగానైనా అర్థమైనట్లు కనిపిస్తోంది.
నిజానికి పుస్తక రచన వేరు... థియేట్రికల్ విజువల్స్ వేరు. పుస్తకం చదివే పాఠకుల సెన్సిబిలిటీస్.... థియేటర్లో కూర్చుని విజువల్స్ చూసే ప్రేక్షకుల మైండ్‌సెట్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఒక పుస్తకంలో ఎమోషన్స్‌ను అక్షరాల రూపంలో పేజీల కొద్దీ వర్ణించవచ్చు.... కానీ వెండితెరపై ప్రేక్షకుడిని లీనం చేయాలంటే దానికి అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్, డ్రామా, సీన్ల వేగం వంటి సరంజామా అంతా వేరేలా ఉండాలి. బహుశా సినిమాటిక్ లిబర్టీ లేదా నిర్మాత పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకుని మేఘన ఇప్పుడు తన కథను చెప్పడానికి కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ పంథాను ఎంచుకున్నారు. అయితే ఈ కథను నడిపించడంలో మేఘనా గుల్జార్ క్రైమ్ థ్రిల్లర్ల గురువులలో ఎవరి శైలిని అనుసరించబోతున్నారనేది మిస్టరీగా మారింది.
కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి పవర్‌ఫుల్ స్టార్ కాస్టింగ్‌తో వస్తున్న `దాయరా` చిత్రం మేఘనా గుల్జార్ కెరీర్‌కు ఎంతో కీలకం కానుంది. ఒక పుస్తక రచయిత్రిగా ఉన్న పరిమితులన్నింటినీ దాటుకుని కమర్షియల్ బాక్సాఫీస్ ఫార్ములాను వంటబట్టించుకుని చేసిన ఈ సరికొత్త ప్రయత్నం కచ్చితంగా సఫలం కావాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. సామాజిక అంశాల లోతును కోల్పోకుండానే... థియేటర్ ఆడియన్స్‌ను థ్రిల్ చేసే అంశాలతో మేఘన ఈ చిత్రాన్ని మలిస్తే కనుక ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. మేఘన ప్రయత్నం దర్శకత్వం వహించాలనుకునే చాలా మంది మేటి పుస్తక రచయితలలో స్ఫూర్తిని నింపాలంటే, కచ్ఛితంగా దాయరా విజయం సాధించాలి. ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ కావాలి.. అదే సమయంలో వందల కోట్లు కొల్లగొట్టాల్సిందే!