లెగసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అక్కా-చెల్లెళపై!
విశ్వనటుడు కమల్ హాసన్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు.
విశ్వనటుడు కమల్ హాసన్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమంలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల గొప్ప నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించరు. ఇప్పటికే కమల్ ఖాతాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్నారు. అలాంటి లెజెండరీ నటుడి వారసత్వాన్నిపుణికి పుచ్చుకుని శ్రుతి హాసన్ కూడా పరిశ్రమలో రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా నటిగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అక్కా-చెల్లెళ్లు ఇండస్ట్రీలో వెలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అక్షరహాసన్ కుటుంబ నేపథ్యం .. సినిమా లెగసీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ కుటుంబం నుంచి వచ్చిన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కావాల్సినంత స్వేచ్ఛతో పాటు లోకరీతులను కూడా నేర్పించారన్నారు. ఇంటి నాలుగు గోడల మధ్య ఎవరికి నచ్చినట్లు వారు ఉండేందుకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని.. అయితే అది బయటి ప్రపంచానికి భిన్నంగా ఉంటుందని తల్లిదండ్రులు తమకు చిన్నప్పుడే అర్థం అయ్యేలా చెప్పారన్నారు.
తల్లిదండ్రులు సొంత కష్టంతో, తమదైన శైలిలో ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని అక్షరా గుర్తు చేశారు. వారి అద్భుతమైన లెగసీని కాపాడేందుకు తాము ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటామన్నారు. ఎలాంటి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకు నేటప్పుడైనా ఏకారణం చేతనైనా తాము ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మర్చిపోమన్నారు. కుటుంబ నేపథ్యంతో పాటు సొంత ప్రతిభపైనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛని చ్చారన్నారు. వారి సరైన మార్గదర్శకత్వం వల్లే సొంత మెరిట్‌పై ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగామని అక్షరహాసన్ సంతోషం వ్యక్తం చేశారు.
కెరీర్‌లో విజయాలు, అపజయాల గురించి మాట్లాడారు. వైఫల్యాల కంటే కూడా విజయాలను సరిగ్గా హ్యాండిల్ చేయడమే కష్టమని అక్షరా అభిప్రాయపడ్డారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాలు తనను ఎంతగానో పరిణతి చెందేలా చేశాయన్నారు. ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలమని పేర్కొన్నారు. ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న అక్షర హాసన్ సరైన సమయం వచ్చి నప్పుడు మరిన్ని బలమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా నడుస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో పని చేస్తున్నట్లు తెలిపారు.