మనోజ్ సినిమాలో కోలీవుడ్ స్టార్?
టైటిల్ ను చూస్తేనే సినిమా కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని, రవి మోహన్ కు ఈ సినిమాలో కీలక పాత్ర దక్కిందని అర్థమవుతుంది.
మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న వడ్డీ కాసులవాడ సినిమాపై మరో ఆసక్తికరమైన ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు రవి మోహన్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆ పాత్రే శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర అని తెలుస్తోంది. టైటిల్ ను చూస్తేనే సినిమా కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని, రవి మోహన్ కు ఈ సినిమాలో కీలక పాత్ర దక్కిందని అర్థమవుతుంది.
ఈ కథ ప్రధానంగా సామాన్యుడి ఆర్థిక కష్టాలు, అప్పులు, వడ్డీ వ్యవస్థ, జీవన పోరాటం వంటి అంశాల చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే తెలిసింది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక భావనను కథతో ముడిపెట్టే ప్రయత్నంలో భాగంగానే వెంకటేశ్వర స్వామి పాత్రను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సాధారణ క్యామియో కాకుండా, కథలో ఎమోషనల్ గా ఇంపాక్ట్ చూపే సన్నివేశాలుంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
రవి మోహన్ గతంలో కూడా భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అందుకే ఈ పాత్రకు ఆయనను ఎంపిక చేసినట్లయితే, అది సినిమాకు అడిషనల్ ఎట్రాక్షన్ గా మారే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ మార్కెట్లలో ఈ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.
ఈ సినిమాకు తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తుండగా, ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌కు తగ్గట్టుగా ఈ కథను రూపొందించారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ తో ఇప్పటికే సినిమాపై ఆసక్తి పెరగ్గా, రవి మోహన్ శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తున్నారనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, వడ్డీ కాసులవాడలో ఇది మోస్ట్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.