టాప్ స్టోరి: మన పాన్ ఇండియా హీరోలకు ఖాన్‌ల సాయం
ఖాన్‌ల త్రయం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు టాలీవుడ్ స్టార్లకు, ముఖ్యంగా ప్రభాస్‌కు పెద్ద అడ్వాంటేజ్‌గా మారబోతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.;
ఖాన్‌ల త్రయం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు టాలీవుడ్ స్టార్లకు, ముఖ్యంగా ప్రభాస్‌కు పెద్ద అడ్వాంటేజ్‌గా మారబోతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. బాలీవుడ్‌ను దశాబ్దాలుగా ఏలిన షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్‌లు ఇప్పుడు వయస్సు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అమీర్ ఖాన్ ఇప్పటికే నటనకు దూరంగా ఉంటూ అడపాదడపా ప్రాజెక్టులు చేస్తుండగా.. సల్మాన్ ఖాన్ రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేయగలుగుతున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ కూడా తన 60 ఏళ్ల వయస్సును దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రాలలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఫైట్లు, భారీ ఛేజ్‌లు వంటి సాహసాలు చేయకుండా వయస్సుకు తగిన పాత్రలనే ఎంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. `కింగ్` లాంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత షారుఖ్ ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. శారీరక శ్రమ తక్కువగా ఉండే కుటుంబ కథలు, మిడిలేజ్ ప్రేమకథలు లేదా థ్రిల్లర్లలో నటించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం షారుఖ్ తన తదుపరి చిత్రాన్ని ఫరా ఖాన్ దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కుటుంబ ఉద్వేగాలు, లవ్ బేస్డ్ కథాంశంతో సాగనుంది. అలాగే అడల్ట్రీ వరల్డ్ నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికర రొమాంటిక్ డ్రామాలో కూడా నటించాలని ఆయన అనుకుంటున్నారు. తన ఇమేజ్ కంటే కూడా వయస్సుకు తగిన పరిణతి కలిగిన పాత్రలకే ఆయన ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. బాలీవుడ్ బాద్షా తీసుకున్న ఈ నిర్ణయం బాక్సాఫీస్ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది.
బాలీవుడ్ అగ్ర హీరోలు మాస్ యాక్షన్ చిత్రాలకు దూరమవుతుండటం.. గ్లోబల్ మార్కెట్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్లకు ఒక గొప్ప అవకాశంగా మారింది. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లు భారీ మాస్ యాక్షన్ చిత్రాలతో ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద తమ హవా చాటుతున్నారు. హిందీ ప్రేక్షకులు కోరుకునే పక్కా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్లను టాలీవుడ్ హీరోలు అందిస్తుండటంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం ఇప్పుడు మన స్టార్ల వైపే చూస్తున్నారు. మల్టీస్టారర్ కథల్లో తెలుగు స్టార్లకు ప్రాధాన్యతనిస్తున్నారు.
ఖాన్‌ల త్రయం కంటే టాలీవుడ్ టాప్ స్టార్ల ఇమేజ్ అమాంతం పెరగడం భారతీయ చిత్ర పరిశ్రమలో వేగంగా విస్తరిస్తున్న గొప్ప పరిణామం. భారీ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ప్రభాస్ వంటి హీరోలకు ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్‌లో తిరుగులేని స్కోప్ లభించనుంది. ఖాన్‌లు సాఫ్ట్ రోల్స్‌కు పరిమితమైతే.. మాస్ యాక్షన్ సామ్రాజ్యాన్ని టాలీవుడ్ హీరోలు ఏలే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ పరిణామాలు భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద తెలుగు స్టార్ల హవా మరింత పెరగడానికి ఆస్కారం కల్పించవచ్చని ఒక అంచనా.