'టూరిస్ట్ ఫ్యామిలీ' మేకర్స్.. మనోడిపై కన్నేశారేంటి?
| ‘లిటిల్ హార్ట్స్’తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి తన తదుపరి సినిమాను తమిళ దర్శకుడు విఘ్నేష్ శ్రీకాంత్‌తో చేయనున్నట్లు సమాచారం. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ నిర్మాణ సంస్థ మిలియన్ డాలర్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు టాక్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది.
'లిటిల్ హార్ట్స్' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మౌళి తనూజ్, ఆ తర్వాత వచ్చిన 'డీఎన్కే' తో ఆ స్థాయి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. అయితే ఈ రిజల్ట్ తర్వాత మౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేష్ శ్రీకాంత్ తో మౌళి సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి, కానీ ఈ కాంబో వెనుక ఉన్న ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ ప్రాజెక్ట్ ను తమిళంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ మిలియన్ డాలర్ స్టూడియోస్ నిర్మించబోతున్నట్లు సమాచారం. పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకుండా, కేవలం సింపుల్ ఎమోషన్స్, క్లీన్ హ్యూమర్ తో చిన్న బడ్జెట్ లో తెరకెక్కిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు అందుకుంది. కంటెంట్ బలంగా ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తారని ఆ సినిమా నిరూపించింది. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న బ్యానర్ ఇప్పుడు తెలుగు యంగ్ హీరో మౌళిపై ఫోకస్ పెట్టడం ఆసక్తి కలిగిస్తోంది.
నిజానికి ఆ తమిళ టీమ్ కు మౌళి సినిమాలపై మొదటి నుంచీ మంచి అభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో 'లిటిల్ హార్ట్స్' విడుదలైనప్పుడు 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్ ఆ సినిమాను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు. యూత్ కనెక్ట్ అయ్యే నేచురల్ హ్యూమర్ విషయంలో ఆ బ్యానర్ ఆలోచనలకు, మౌళి బాడీ లాంగ్వేజ్ కు బాగా సింక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే 'డీఎన్కే' ఫలితంతో సంబంధం లేకుండా మౌళితో సినిమా చేసేందుకు ఆ నిర్మాతలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
మౌళి కెరీర్ పరంగా చూస్తే ఇది ఒక స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు. 'డీఎన్కే' లో కామెడీ కొంచెం ఫోర్స్డ్ గా ఉందనే విమర్శలు రావడంతో, మళ్లీ తన బలమైన జోన్ అయిన సెన్సిబుల్ ఎంటర్ టైనర్స్ వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. పైగా తమిళ ప్రొడక్షన్ హౌస్ తో చేతులు కలపడం వల్ల తెలుగుతో పాటు కోలీవుడ్ మార్కెట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కుతుంది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు రెండు భాషల్లో మార్కెట్ క్రియేట్ చేసుకున్న తరహాలోనే మౌళి కూడా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న విఘ్నేష్ శ్రీకాంత్ కూడా తన తొలి సినిమా 'వన్స్ మోర్' తో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్ దాస్, అదితి శంకర్ నటించిన ఆ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయికి చేరకపోయినా, ఎమోషన్స్, మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంది. మౌళి కామెడీ టైమింగ్, విఘ్నేష్ ఎమోషనల్ ట్రీట్మెంట్ కలిస్తే ఒక ఫ్రెష్ ఫ్యామిలీ లేదా యూత్ డ్రామా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా తెలుగులో రూపొందుతుందా, లేక తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది. తమిళ ఆడియన్స్ కు మౌళి కొత్త కావడంతో అక్కడ ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది కీలకం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.