స్టార్ హీరో కోసం 30 వేల అసభ్యకర పోస్టులు.. మీరా చోప్రా షాకింగ్ కామెంట్స్..!
| నటి మీరా చోప్రా 2020లో ఓ స్టార్ హీరో అభిమానుల నుంచి ఎదురైన వేధింపుల గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెల్లడించారు. దక్షిణాదిలో తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అని, మరో హీరోకు తాను అభిమానిని కాదని చెప్పడంతో కొందరు సోషల్ మీడియాలో దూషించారని తెలిపారు. అత్యాచారం, హత్య బెదిరింపులతో పాటు 30 వేల వరకు అసభ్యకరమైన ట్వీట్లు వచ్చాయని, ఈ వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసుకున్నారు.
సినిమా హీరోలపై అభిమానం ఉండటం తప్పు కాదు. తమ అభిమాన నటుడి సినిమాలను ఇష్టపడడం, ఆయన విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇదే అభిమానం కొన్నిసార్లు హద్దులు దాటుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు అభిమానులు చేసే వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తమ హీరోను ఎవరైనా విమర్శించినా, మరో నటుడిని ఇష్టపడుతున్నామని చెప్పినా వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతూ ఉంటారు. బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీరా చోప్రా .. చేసిన వ్యాఖ్యలు మరోసారి.. ఇలాంటి వాటినే గుర్తు చేస్తున్నాయి.
2020లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీరా చోప్రా ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మరోసారి చెప్పుకొచ్చారు. ఒక స్టార్ హీరో అభిమానుల నుంచి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె మాట్లాడారు. కేవలం ఒక నటుడికి తాను అభిమానిని కాదని చెప్పినందుకు ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఈ వివాదం ట్విట్టర్లో జరిగిన ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో జరిగింది. ఆ సమయంలో ఓ నెటిజన్ మీరా చోప్రాను దక్షిణాది సినిమాల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని ప్రశ్నించారు. దీనికి ఆమె మహేష్ బాబు పేరు చెప్పారు. ఆ తర్వాత మరో వ్యక్తి ఇంకో స్టార్ హీరో గురించి గురించి అడిగారు. అయితే తనకు ఆయన గురించి పెద్దగా తెలియదని..తాను ఆయన అభిమానిని కాదని మీరా సమాధానం ఇచ్చారు.
ఈ చిన్న సమాధానం సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. కొందరు అభిమానులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. అసభ్యకరమైన పదాలతో దూషించడం మొదలుపెట్టారు. పరిస్థితి మరింత దారుణంగా మారింది. తనకు అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయని మీరా వెల్లడించారు. దాదాపు 30 వేల వరకు అసభ్యకరమైన ట్వీట్లు తనపై వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదంలో తన కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా కొందరు టార్గెట్ చేశారని చెప్పారు.
ఈ వేధింపులపై మీరా చోప్రా మౌనంగా ఉండలేదు. సదరు హీరోను నేరుగా ట్యాగ్ చేస్తూ స్పందించారు. తన అభిమానుల పేరుతో కొందరు మహిళను బెదిరిస్తుంటే హీరో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తనను ఖండించాల్సిన బాధ్యత ప్రముఖులపై కూడా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా ఈ వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిజానికి ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన హీరోను అభిమానించే హక్కు ఉంది. కానీ అభిమానులు ఇలా చేయడం మాత్రం ఎప్పటికీ తప్పే అనేది చాలామంది అభిప్రాయం.