యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..
| సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో మరో యంగ్ హీరో సినిమా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కిరణ్ అబ్బవరం హీరోగా, ‘పుష్ప’కు పనిచేసిన వీర కోగటం దర్శకుడిగా పరిచయం కానున్నట్లు సమాచారం. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 23న పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నా, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దర్శకుడిగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో భారీ పాన్ ఇండియా సినిమాలు చేసే సుకుమార్, నిర్మాతగా మాత్రం పూర్తిగా భిన్నమైన రూట్ లో వెళ్తున్నారు. 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ స్థాపించినప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా యంగ్ హీరోలు, కొత్త దర్శకుల మీదే ఉంటోంది. కంటెంట్ లో కొత్తదనం ఉంటే చాలు, హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ఆయనకు అలవాటుగా మారింది.
నిర్మాతగా సుకుమార్ జర్నీ రాజ్ తరుణ్ నటించిన 'కుమారి 21ఎఫ్' తోనే సాలిడ్ గా మొదలైంది. అప్పట్లో యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన ఆ సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ను 'ఉప్పెన' సినిమాతో పరిచయం చేయడంలోనూ సుకుమార్ కీలక పాత్ర పోషించారు. తన శిష్యుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా నిలబెడుతూనే, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
యంగ్ హీరోలతో సుకుమార్ చేసిన ప్రయోగాలు అక్కడితో ఆగిపోలేదు. నిఖిల్ తో '18 పేజెస్' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని నిర్మించి, సాయి దుర్గా తేజ్ తో 'విరూపాక్ష' రూపంలో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా మిస్టరీ థ్రిల్లర్ జానర్ ను ఎంచుకోవడం బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అదే 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండుతో నాగచైతన్య హీరోగా 'వృషకర్మ' అనే భారీ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సుకుమార్ కేవలం డబ్బులు పెట్టడమే కాకుండా కొన్ని సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ క్రియేటివ్ గానూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ, ప్రియదర్శి లాంటి టాలెంటెడ్ నటులతోనూ కొత్త సినిమాలను లైన్ లో పెట్టారు. ఒకవైపు రామ్ చరణ్ తో చేయబోయే తదుపరి సినిమా పనులతో బిజీగా ఉంటూనే, తన బ్యానర్ లో కుర్ర హీరోల లైనప్ ను పెంచుకుంటూ పోతున్నారు.
లేటెస్ట్ గా సుకుమార్ రైటింగ్స్ లిస్టులో మరో యంగ్ హీరో చేరబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న కిరణ్ అబ్బవరం హీరోగా సుకుమార్ ఒక సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం. 'పుష్ప' సినిమాలకు పనిచేసిన వీర కోగటం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 23న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్, కిరణ్ అబ్బవరం కాంబినేషన్ పై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే తన బ్యానర్ లో కొత్త దర్శకులు, యంగ్ హీరోలతో సక్సెస్ రేట్ మెయింటైన్ చేస్తున్న సుకుమార్, ఈసారి కిరణ్ అబ్బవరం ఇమేజ్ కు తగ్గట్టుగా ఎలాంటి కథను సిద్ధం చేశారో చూడాలి.