నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!
| కూతురు ఆద్యపై సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ కామెంట్లపై నటి రేణు దేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌పై అభిమానంతో ఈవెంట్‌కు వచ్చిన 16 ఏళ్ల ఆద్యను ట్రోల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగులో మాట్లాడినప్పుడు ప్రశాంతంగా విన్న మమ్ముట్టిని కూడా విమర్శించడంపై మండిపడ్డారు. మమ్ముట్టి, ధనుష్ నటిస్తున్న ‘ఓ.ఎం’తో రేణు తమిళ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
ఉన్నదున్నట్టు ముక్కు సూటిగా మాట్లాడేయడం కొందరికే చెల్లుబాటు అవుతుంది. ఇదే కేటగిరీకి చెందుతారు రేణు దేశాయ్. దాపరికం లేని ముక్కుసూటి తత్వంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. అయితే తమిళ సినిమా `ఓ.ఎం` ఈవెంట్‌కు హాజరైన తన 16 ఏళ్ల కూతురు ఆద్యపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న నెగెటివ్ కామెంట్లపై నటి రేణు దేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా తన ఇన్‌స్టా ఖాతాలో కామెంట్స్ సెక్షన్‌ను పరిమితం చేసే రేణు.. ఇది తమిళ సినిమా కావడం.. తన వ్యక్తిగత జీవితంతో సంబంధం లేని విషయం కావడంతో పొరపాటున కామెంట్స్ ఓపెన్ చేసి చూశానని తెలిపారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్‌పై ఉన్న అభిమానంతో సరదాగా తనతో పాటు ఈవెంట్‌కు వచ్చిన చిన్నారి ఆద్యను కూడా కొందరు అసభ్యకరంగా తిట్టడం చూసి తల్లడిల్లిపోయానని.. అసలు ఆ పసిపిల్ల ఏం తప్పు చేసిందని ప్రశ్నించారు.
అంతేకాకుండా వేదికపై తాను తెలుగులో మాట్లాడుతున్న సమయంలో భాష అర్థం కాక ఎంతో ప్రశాంతంగా కూర్చుని వింటున్న సీనియర్ నటుడు మమ్ముట్టి ని కూడా ట్రోల్ చేయడంపై రేణు మండిపడ్డారు. ఇలాంటి నీచమైన కామెంట్లు చేసేవారు తమ రాక్షస ప్రవృత్తిని.. తప్పుడు పెంపకాన్ని బయటపెట్టుకుంటున్నారే తప్ప మరేమీ లేదని రేణు ఘాటుగా విమర్శించారు. సమాజంలో కొందరు వ్యక్తుల్లో పేరుకుపోయిన ఈ విపరీతమైన నెగెటివిటీ చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు.
మరోవైపు పండుగల సమయంలో అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల వరకు టపాసులు కాల్చడం..డీజేలు పెట్టడంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను కాలుష్యం గురించో.. శబ్దం గురించో మాట్లాడటం లేదని.. రాత్రి 8 లేదా 9 గంటల లోపు ఎంతైనా సంబరాలు చేసుకోవచ్చని.. కానీ అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించడం సరికాదని రేణు దేశాయ్ హితవు పలికారు.
ఇది ఒక్క రేణు దేశాయ్ అనుభవమే కాదు.. సోషల్ మీడియా ఖాతా ఉన్న ప్రతి సెలబ్రిటీ అనుభవం. ప్రతి కథానాయిక లేదా నటీమణి అనుభవం. అయితే సోషల్ మీడియాల్లో కామెంట్లకు ప్రతిస్పందిస్తే ప్రతి రోజూ యుద్ధాలే. కానీ రేణు ఇలాంటి వాటికి స్పందించడం, పట్టించుకోవడం అనవసరం. తదుపరి తన సినిమా కెరీర్ గురించి లేదా ఆద్య, అకీరా వంటి కిడ్స్ కెరీర్ గురించి ఎక్కువ పట్టించుకోవడమే ఉత్తమమని కూడా అభిమానులు సూచిస్తున్నారు.
మమ్ముట్టి, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ చిత్రం-`ఓ.ఎం`లో రేణు దేశాయ్ పాత్ర ఎంతో కీలకంగా.. కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత తమిళ తెరపై రీఎంట్రీ ఇస్తున్న రేణు ఇందులో ఒక బలమైన ఎమోషన్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. మమ్ముట్టి, ధనుష్ పాత్రల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాల్లో ఈ పాత్ర కీలకంగా కనిపించనుందట. నటనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ రోల్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.