ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!
| ‘ఓఎం’ సినిమా ఈవెంట్‌లో ధనుష్ కుమారులు యాత్ర, లింగా తమ తండ్రిపై ప్రేమను చాటుకున్నారు. ధనుష్ నటించిన సినిమాలన్నీ ఇష్టమని, ఆయనను తెరపై చూస్తూనే ఉండాలనిపిస్తుందని చెప్పారు. దీనికి భావోద్వేగానికి గురైన ధనుష్.. తన పిల్లలు తనకంటే పది రెట్లు గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
తమిళ స్టార్ హీరో ధనుష్ నటనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ధనుష్‌కు తన ఇద్దరు కుమారులైన యాత్ర, లింగాల నుంచి లభించే ప్రేమ చూస్తే మరింత ముచ్చటేయ్యడం ఖాయం. తాజాగా జరిగిన OM సినిమా కార్యక్రమంలో ఈ తండ్రీకొడుకుల మధ్య ఉన్న అనుబంధం అందరిని ఫిదా చేసింది.
ఈ కార్యక్రమంలో యాత్ర, లింగాలను మీ నాన్న నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? అని ప్రశ్నించారు. దీనికి యాత్ర ఎంతో ప్రేమగా సమాధానం ఇచ్చాడు. "నాన్న నటించిన సినిమాలన్నీ నాకు ఇష్టమే. ఆయన తెరపై కనిపిస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది" అని చెప్పాడు. తన తండ్రిపై ఉన్న అభిమానాన్ని ఈ ఒక్క మాటతో చాటుకున్నాడు.
మరోవైపు లింగా కూడా ఇదే తరహాలో స్పందించాడు. నాన్న నటించిన సినిమాల్లో ఒక్కదానిని మాత్రమే ఎంచుకోవడం కష్టమని చెప్పాడు. ఆయన చేసే ప్రతి పనిని తాను ఇష్టపడతానని తెలిపాడు. అంతేకాదు, ధనుష్ నటించిన OM సినిమాను థియేటర్‌లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
ఆ తరువాత ధనుష్ కూడా తన మనసులోని మాటలను బయటపెట్టాడు. తన ఇద్దరు కుమారులు కూడా తనలాగే చాలా సిగ్గుపడతారని చెప్పాడు. తాను చేసే ప్రతి పనికి ఒక ముఖ్యమైన కారణం ఉందని, తన పిల్లలు తనను చూసి గర్వపడాలన్నదే తన కోరిక అని తెలిపాడు. భవిష్యత్తులో తన కుమారులు కూడా గొప్ప విజయాలు సాధించి తనకు గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
"ఈ రోజు నేను మీకు గర్వకారణంగా ఉండేలా కష్టపడుతున్నాను. రేపు మీరు కూడా నాకు గర్వకారణంగా నిలవాలి. అప్పుడు మిమ్మల్ని కూడా అదే అడిగే హక్కు నాకు ఉంటుంది. ఐ లవ్ యూ యాత్ర, లింగా. మీరు నాకంటే పది రెట్లు పెద్ద స్థాయికి ఎదుగుతారు" అంటూ ధనుష్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాటలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి.
ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులకు యాత్ర, లింగా ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో ఇద్దరూ తమ బాధ్యతను కొనసాగిస్తున్నారు.
ఇక ధనుష్ నటించిన ‘OM: చాప్టర్ 1 - ఉధిరం' (OM: Operation Mole) నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.