Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!
| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 'డిక్టేటర్స్' గేమ్ కంటెస్టెంట్ల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. త్రిగుణ్, ముఖేష్ మధ్య బెడ్‌రూమ్, కిచెన్ కోసం మైండ్ గేమ్స్ నడిచాయి. టీమ్ మార్పులో నీతూ మాస్టర్ స్థానంలో అమన్‌ను తీసుకున్న త్రిగుణ్.. కిచెన్ టాస్క్‌లో అమన్ అద్భుత ప్రదర్శనతో ముఖేష్ టీమ్‌పై విజయం సాధించాడు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో ప్రస్తుతం నడుస్తున్న 'డిక్టేటర్స్' గేమ్ కేవలం టాస్క్‌లకే పరిమితం కాకుండా కంటెస్టెంట్ల మధ్య ఈగోకి దారి తీసింది. డిక్టేటర్లుగా వ్యవహరిస్తున్న త్రిగుణ్ మరియు ముఖేష్‌ల మధ్య బెడ్‌రూమ్, కిచెన్ ఏరియాల ఆధిపత్యం కోసం సాగిన మైండ్ గేమ్, ఛాలెంజ్‌లు హౌస్‌లో తీవ్ర ఉత్కంఠ రేపాయి.
మొదటి గేమ్ గెలిచి బెడ్‌రూమ్ ఏరియాను తన ఆధీనంలోకి తీసుకున్న త్రిగుణ్.. ప్రత్యర్థి ముఖేష్ టీమ్‌లోని రామకృష్ణ, నరేష్‌లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బెడ్‌రూమ్‌లో నిద్రపోవడానికి అవకాశం ఇస్తానని, అయితే దానికి ప్రతిఫలంగా 'త్రిగుణనా దూత' అని చెప్పాలని కండిషన్ పెట్టాడు. గతంలో తనను ఎగతాళి చేసినందుకు త్రిగుణ్ ఇలా బదులు తీర్చుకున్నాడు. కానీ రామకృష్ణ మరియు నరేష్ ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా త్రిగుణ్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించి నిజాయితీని చాటుకున్నారు.
మరో డిక్టేటర్ ముఖేష్ కూడా తన ఆధీనంలో ఉన్న కిచెన్ ఏరియా విషయంలో త్రిగుణ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కిచెన్‌లో స్టవ్ వెలిగించి వంట చేసుకోవాలంటే, త్రిగుణ్ టీమ్‌లోని శివ వచ్చి 'సర్, సర్.. ముఖేష్ సర్' అని పిలవాలని షరతు పెట్టాడు. కానీ శివ కూడా తన టీమ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నో చెప్పడంతో కిచెన్‌లో పొయ్యి వెలగక, అందరికీ వంట చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
కిచెన్ ఏరియా ఎవరి సొంతమనే డైలమాకు తెరదించేందుకు బిగ్‌బాస్ రెండు టీమ్‌లకు ఒక టాస్క్ ఇచ్చారు. త్రిగుణ్ టీమ్ నుంచి శివ, వంశీ.. ముఖేష్ టీమ్ నుంచి వర్షిణి, రామకృష్ణ పోటీపడ్డారు. అయితే ఇరు జట్ల లీడర్లు శివ, వర్షిణిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, ఇద్దరూ గెలిచామని వాదించడంతో డెసిషన్ తీసుకోవడంలో డిక్టేటర్లు విఫలమయ్యారు. దీంతో బిగ్‌బాస్ ఆ టాస్క్‌ను రద్దు చేశారు.
ఆ తర్వాత టీమ్ సభ్యులను 'స్ట్రాంగ్, స్ట్రాంగెస్ట్, వీక్, వీకెస్ట్' కేటగిరీలుగా విభజించగా.. ముఖేష్ టీమ్‌లో అమన్ స్ట్రాంగ్‌గా నిలిచాడు. ఆధిక్యంలో ఉన్న త్రిగుణ్‌కు బిగ్‌బాస్ ఒక ప్రత్యేక ఆఫర్ ఇస్తూ, ప్రత్యర్థి టీమ్‌లోని ఒకరితో తన టీమ్ సభ్యుడిని మార్చుకునే అవకాశం ఇచ్చారు. త్రిగుణ్ ఏమాత్రం ఆలోచించకుండా తన టీమ్‌లోని వీక్ కంటెస్టెంట్ నీతూ మాస్టర్‌ను ముఖేష్ టీమ్‌కు పంపి, అక్కడి నుంచి బలమైన అమన్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నాడు.
కిచెన్ ఏరియా కోసం బిగ్‌బాస్ పెట్టిన తదుపరి టాస్క్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇందులో ఒకరు 'బలవంతుడు'గా వెయిట్‌లిఫ్టింగ్ బరువులు మోయాలి, మరొకరు 'బుద్ధిశాలి'గా సంచాలకులు అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు చెప్పాలి. ప్రశ్నలకు సమాధానాలు ఆలస్యమయ్యే కొద్దీ బలవంతుడి చేతిలోని రాడ్లకు బరువులు పెరుగుతూ ఉంటాయి.
ఈ టాస్క్‌లో త్రిగుణ్ టీమ్ తరఫున అమన్ (బలవంతుడు), దెబ్జానీ (బుద్ధిశాలి), వంశీ (సంచాలకుడు) బరిలోకి దిగగా.. ముఖేష్ టీమ్ నుంచి రామ్‌ప్రసాద్ (బలవంతుడు), వర్షిణి (బుద్ధిశాలి), ముఖేష్ (మైండ్ గేమ్) పోటీపడ్డారు.
ప్రశ్నలు, సమాధానాల మధ్య బరువులు విపరీతంగా పెరిగిపోవడంతో రామ్‌ప్రసాద్ ఆ భారమైన వెయిట్‌ను మోయలేక ఓడిపోయాడు. కానీ అమన్ మాత్రం తన అద్భుతమైన శారీరక బలంతో చివరి వరకు పట్టువదలకుండా ఆ బరువులను మోసి త్రిగుణ్ టీమ్‌కు ఘనవిజయాన్ని అందించాడు.