'రామాయణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?
| ‘రామాయణం: పార్ట్ 1’ ఓటీటీ హక్కులు ఇంకా ఎవరికీ అమ్మలేదని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఏ స్ట్రీమింగ్ సంస్థతోనూ ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లు వసూలు చేసినట్లు కథనం పేర్కొంది. 2028లో విడుదల కానున్న పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయింది.
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న భారీ చిత్రం `రామాయణం: పార్ట్ 1` ఓటీటీ విడుదలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులు ఇప్పటివరకు ఎవరికీ అమ్ముడుపోలేదని.. ప్రస్తుతం ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌తోనూ ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు. సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ థియేటర్లలో విడుదల కాకముందే ఓటీటీ హక్కులను కళ్లు చెదిరే ధరలకు విక్రయిస్తుంటాయి. కానీ.. ఈ స్థాయి బ్లాక్‌బస్టర్ సినిమా విషయంలో ఇలా జరగడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
డిజిటల్ డీల్‌ను ఇప్పుడే ఫైనల్ చేయకపోవడానికి వెనుక చిత్ర బృందం ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను కేవలం థియేటర్లకే పరిమితం చేసి.. ప్రేక్షకులు నేరుగా పెద్ద తెరపైనే ఆ అద్భుత దృశ్యకావ్యాన్ని ఆస్వాధించేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెంటనే ఆన్‌లైన్ విడుదల లేకపోయినా.. కంటెంట్‌లో బలం ఉంటే సినిమాలు థియేటర్లలో ఏ స్థాయిలో విజయవంతం కాగలవో నిరూపించే ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ఈ సినిమాను ఆన్‌లైన్‌లో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
మరోవైపు.. బాక్సాఫీస్ వద్ద `రామాయణం: పార్ట్ 1` వసూళ్ల దూకుడు ఆగడం లేదు. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1200 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇదే జోరు కొనసాగిస్తూ దిగ్విజయంగా రూ. 2000 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పడమే కాకుండా.. ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో భారీ వసూళ్లను కొల్లగొడుతోంది.
తొలి భాగం సృష్టించిన ఈ చారిత్రాత్మక విజయంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న `రామాయణం: పార్ట్ 2` గురించి సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదటి భాగాన్ని మించేలా అత్యున్నత సాంకేతిక విలువలతో రెండో భాగాన్ని తీర్చిదిద్దుతున్నారని.. 2028లో `రామాయణం: పార్ట్ 2` ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. రామాయణం చిత్రానికి నమిత్ మల్హోత్రా, యష్ నిర్మాతలు కాగా, నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.