100వ సినిమా హడావిడి ఇంతేనా?
| నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’ను డిసెంబర్ 24న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ చివరి లేదా డిసెంబర్ మొదటి వారంలో పూర్తికానుందని సమాచారం. అయితే విడుదలకు ఐదు వారాలే సమయం ఉన్నా ప్రమోషన్లు, పాటలు ప్రారంభించకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో టబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్.
టాలీవుడ్ కింగ్ నాగార్జున అరుదైన మైలు రాయి వద్ద నిల్చున్నారు. ఆయన తన కెరీర్లో వందవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నాగార్జున వందవ సినిమా 'కింగ్100' పై అంచనాలు భారీగా పెరిగాయి. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రిలీజ్ డేట్ విషయంలో నాగార్జున చాలా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కి రావాల్సిందే అని ఆయన వర్క్ చేస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్ చివరి వరకు లేదా డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టే విధంగా షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. షూటింగ్ పూర్తి కాకముందే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టినట్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
కింగ్ 100 సినిమాతో నాగార్జున...
ఈమధ్య కాలంలో సినిమాల మేకింగ్ కంటే, ఆ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం ఎక్కువ క్రియేటివిటీని ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సినిమాలు స్వతహాగా పబ్లిసిటీ దక్కించుకుని జనాల్లోకి వెళ్తాయి, కొన్ని మాత్రం తప్పకుండా పబ్లిసిటీ చేయాల్సి ఉంది. కింగ్ 100 సినిమా నాగార్జున కెరీర్లో 100వ సినిమా అనే ఒక్క రీజన్‌తో జనాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఆ చర్చ సరిపోదని, ప్రేక్షకుల్లోకి వెళ్లేందుకు ఇంకాస్త ఎక్కువ పబ్లిసిటీ కావాల్సిందే అని సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇంకా జనాల్లోకి ఎక్కువ వెళ్లడం కోసం కనీసం నెల రోజుల ముందు నుంచి పబ్లిసిటీ హడావుడి మొదలు పెట్టాలి. కానీ ఇప్పటి వరకు కింగ్ 100 సినిమాకు సంబంధించిన ప్రమోషన్ హడావిడి కనిపించడం లేదు. ఆ మధ్య విడుదల చేసిన ఒక వీడియో తప్ప ఇప్పటి వరకు కొత్తగా పబ్లిసిటీ స్టఫ్ విడుదల కాలేదు.
రా కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున 100వ సినిమా...
నాగార్జున ప్రతిష్టాత్మక మూవీ కావడంతో పాటు, దర్శకుడు రా కార్తీక్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఉన్నాయి. అయితే రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం సినిమా గురించి ఇంకా మాట్లాడుకోవడం మొదలు పెట్టలేదు. కనుక మేకర్స్ ఒక వైపు సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూస్తూ మరో వైపు ప్రమోషన్ కూడా మొదలు పెట్టాలని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. నెల రోజుల ముందు నుంచే సినిమా గురించి మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటే విడుదల సమయం కు ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పటికి అయినా కింగ్ 100 సినిమా ప్రమోషన్ ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు రా కార్తీక్ కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన షూటింగ్‌ను ముగించే పనిలోనే ఉన్నట్లు యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
నాగార్జున సినిమాలో టబు విలన్...
ఈ సినిమాలో నాగార్జునతో పాటు ముఖ్య పాత్రలో టబు కనిపించబోతుంది. ఆమె నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సుష్మిత భట్ కనిపించబోతుంది. ఆమె నాగార్జున కూతురు పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఐశ్వర్య రాజేష్, అశోక్ సెల్వన్, సాయి కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. నాగార్జున, దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన విషయం తెల్సిందే. అందుకే కింగ్ 100 సినిమాలోని పాటల కోసం ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా అయిదు వారాల సమయం మాత్రమే ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పాటను విడుదల చేయక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా విడుదల కాబోతున్న దాదా నుంచి ఇప్పటికే ఒక పాట వచ్చిన విషయం తెల్సిందే. దాంతో కింగ్ 100 సినిమా ప్రమోషన్ స్పీడ్ పెంచాలని, హడావిడి లేకుంటే కష్టం అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రా కార్తీక్ కింగ్ 100 సందడి ఎప్పటి నుంచి మొదలు పెట్టనున్నాడో చూడాలి.