మూవీ రివ్యూ : దురంధర్: ది రివెంజ్
గత ఏడాది డిసెంబరు 5న పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం రేపింది ‘దురంధర్’.;
‘దురంధర్: ది రివెంజ్’ మూవీ రివ్యూ
నటీనటులు: రణ్వీర్ సింగ్- సారా అర్జున్- సంజయ్ దత్- అర్జున్ రాంపాల్- మాధవన్- రాకేష్ బేడీ తదితరులు
సంగీతం: శశ్వత్ సచ్ దేవ్
ఛాయాగ్రహణం: వికాస్ నౌలాఖా
నిర్మాతలు: ఆదిత్య ధర్- లోకేష్ ధర్- జ్యోతి దేశ్ పాండే
రచన-దర్శకత్వం: ఆదిత్య ధర్
గత ఏడాది డిసెంబరు 5న పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం రేపింది ‘దురంధర్’. రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా థియేటర్లను హోరెత్తించి ఏకంగా రూ.1400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఒక కథనే రెండు భాగాలుగా తీసి పార్ట్-1తో మురిపించిన ఆదిత్య ధర్.. ఇంకో మూడు నెలలకే రెండో భాగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దురంధర్: ది రివెంజ్’ పార్ట్-1 లాగే మెప్పించిందా? ఈ కథను ఆదిత్య ఎలా ముందుకు తీసుకెళ్లాడు? ఎలా ముగించాడు? తెలుసుకుందాం పదండి.
కథ:
హంజా అలీగా పేరు మార్చుకుని పాకిస్థాన్లో స్థిరపడ్డ ఇండియన్ ఏజెంట్ జస్కీరత్ సింగ్ రంగి.. ఆ దేశ రాజకీయాల్లో ఎంతో కీలకం అయిన ల్యారీ సిటీలో జెండా పాతుతాడు. ల్యారీని ఏలుతున్న రెహమాన్ దైకత్ ను మట్టుబెట్టి నెమ్మదిగా ఆ సిటీ మీద పట్టు సాధిస్తాడు. ఈ క్రమంలో ఒక్కో అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగుతాడు. ల్యారీకి కింగ్ అయ్యాక 26/11 ముంబయి దాడులకు ప్రతిగా ఉగ్రవాద నాయకులను.. వారికి అండగా నిలిచిన నేతలను అతను లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి.. వాటిని ఎలా అధిగమించాడు.. చివరికి అతను తన మిషన్ పూర్తి చేశాడా? ఇంతకీ అతడి నేపథ్యమేంటి? తిరిగి ఇండియాకు రాగలిగాడా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
సినిమాలో విషయం లేకపోతే.. గంటన్నర రెండు గంటల తక్కువ నిడివి ఉన్నా కుదురుగా కూర్చోవడం కష్టమవుతుంది. కానీ కంటెంట్ ఉంటే మూడు గంటలు అంతకుమించిన నిడివి ఉన్నా సమస్య లేదని గత కొన్నేళ్లలో రంగస్థలం, అర్జున్ రెడ్డి, యానిమల్, పుష్ప-2 లాంటి చాలా సినిమాలు రుజువు చేశాయి. ఐతే ‘దురంధర్-2’ నిడివి ఏకంగా నాలుగ్గంటలు. ‘దురంధర్’ ఎంత పెద్ద హిట్టయి ఉండనీ.. ఇంతసేపు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టడం అన్నది సవాలే. ‘దురంధర్’ సినిమా నచ్చి, మధ్యలో ఆగిన కథను పూర్తిగా చూద్దాం అన్న ఆసక్తితో ‘దురంధర్-2’ థియేటర్లలో అడుగుపెట్టిన వాళ్లకు ఇంత పెద్ద నిడివి ఉన్న సినిమాలో ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు అంటే అతిశయోక్తి కాదు. నాలుగ్గంటల సినిమా చూశాక కూడా ఏమాత్రం విసుగురాకపోగా.. రోలింగ్ టైటిల్స్ పడుతున్నపుడు థియేటర్ల నుంచి కదలబుద్ధి కాకుండా స్క్రీన్ వైపు అతుక్కుపోతామంటే అది ఎంతగా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మితిమీరిన హింసాత్మక సన్నివేశాలున్నాయని.. దీని వెనుక రాజకీయం ఉందని.. ఇది ప్రాపగండా ఫిలిం అని.. అబద్ధాలు-అతిశయోక్తులు ఎక్కువయ్యాయని.. ఎవరు ఎన్ని ఫిర్యాదులైనా చేయనీ.. ఎవరికి ఏ అభ్యంతరాలైనా ఉండనీ.. ‘దురంధర్’ నచ్చి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు వాళ్లు కోరుకున్న దాన్ని మించి ‘దురంధర్-2’ హై ఇస్తుందనడంలో సందేహం లేదు. పార్ట్-1 కంటే పార్ట్-2 ఒక మెట్టు పైనే నిలుస్తుంది తప్ప తక్కువ కాదు.
కథపై ఏ అవగాహన లేకుండా.. సినిమా మీద పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను ‘దురంధర్-1’ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా నుంచి ఆడియన్సుకు దక్కిందంతా బోనస్సే. అప్పటిదాకా పాకిస్థాన్ లక్ష్యంగా పని చేసే ఇండియన్ స్పై హీరో అంటే ఒక మూసలో సాగిపోయేవి. స్పై సినిమాలు అంటే అలాగే ఉంటాయి అన్న భ్రమలో చాలా ఏళ్లు ఉండిపోయారు మన ప్రేక్షకులు. కానీ రియల్ స్పై అంటే ఇలా ఉంటాడు.. సీక్రెట్ ఆపరేషన్ల వెనుక ఇంత తతంగం ఉంటుందీ అంటూ ఎన్నో తెలియని కోణాలను అద్భుత రీతిలో చూపిస్తూ ‘దురంధర్’ ప్రేక్షకులకు ఆదిత్య ధర్ ఇచ్చిన అనుభూతే వేరు. ఐతే ‘దురంధర్’ చూశాక.. అసాధారణంగా పెరిగిపోయిన అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. ఆల్రెడీ ‘దురంధర్’ వరల్డ్ పరిచయం అయిపోయింది. పార్ట్-1లోనే చాలా కథ చూశారు. పైగా అందులో అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ దైకత్ పాత్ర హీరోని మించి హైలైట్ అయింది. అలాంటి పాత్రను ముగించేశాక పెరిగే అంచనాలను అందుకోవడం.. బాగా అలవాటైపోయిన ‘దురంధర్’ వరల్డ్ లో కొత్తదనం పంచడం.. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. పైగా ఇప్పటికే మూడున్నర గంటలు చూసిన కథను.. ఇంకో నాలుగ్గంటల పాటు చెప్పడం అంటే అసామాన్యమైన విషయం. కానీ ఆదిత్య ధర్.. ఈ టాస్కుని అద్భుత నైపుణ్యంతో అలవోకగా పూర్తి చేశాడు.
‘దురంధర్’లో హీరోను నేరుగా స్పైగా పరిచయం చేసి.. పాకిస్థాన్‌లో అడుగుపెట్టి అక్కడ ల్యారీ సిటీ మీద కాస్త పట్టు సాధించడం.. ఆ సిటీకి కింగులా ఉన్న రెహమాన్ ను మట్టుబెట్టడం వరకు కథను నడిపించాడు ఆదిత్య. పార్ట్-2లో అసలు హీరో నేపథ్యమేంటి.. అతను స్పైగా ఎందుకు మారాడన్న దాని మీద కథను మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత తిరిగి వర్తమానంలోకి వచ్చి హంజా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ల్యారీకి తనే ఎలా కింగ్ అయ్యాడు.. పాకిస్థాన్ రాజకీయాలను ఎలా శాసించాడు.. ఆపై తన మిషన్లో భాగంగా ఒక్కొక్కరిని ఎలా మట్టుబెట్టాడు అన్న నేపథ్యంలో కథ ముందుకు సాగుతుంది. ఐతే సింపుల్ గా కథను చెప్పేస్తాం కానీ.. తెర మీద అది నడిచే తీరు మాత్రం రసవత్తరంగా ఉంటుంది. హీరో ఒక్కడే ఇంత ఎలా చేసేస్తాడు.. అన్నీ అతడికి అనుకూలంగా ఎలా జరిగిపోతాయి అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి కానీ.. వాటి మీద మరీ ఫోకస్ నిలవనీయకుండా..స్ట్రక్ అయిపోకుండా అదిరిపోయే సన్నివేశాలతో మ్యాజిక్ చేస్తాడు ఆదిత్య. మధ్యలో కథ కొంచెం నెమ్మదిస్తున్న సమయంలో దావూద్ ఇబ్రహీం పాత్రను ప్రవేశపెట్టి.. క్యూరియాసిటీ కలిగిస్తాడు. దావూద్ పాత్రతో ముడిపడ్డ రెండు సన్నివేశాలూ ప్రేక్షకులను అరెస్ట్ చేసేస్తాయి. ల్యారీ సింహాసనం మీద హంజా కూర్చునే ఎపిసోడ్ భలేగా అనిపిస్తుంది. ఇక సినిమాలో అత్యంత థ్రిల్లింగ్ గా అనిపించే.. తీవ్ర ఉత్కంఠకు గురి చేసే ఎపిసోడ్ అంటే.. డ్రగ్ డీలర్ అయిన తన పాత మిత్రుడిని హీరో ఎలా డీల్ చేశాడన్నదే.
ద్వితీయార్ధంలో ఎలివేషన్లకు ఎలివేషన్లు.. ఎమోషన్లకు ఎమోషన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. రాజకీయ కోణం పక్కన పెడితే.. పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుంది. చివర్లో మాధవన్ ఫోన్ కాల్ ఎపిసోడ్ కూడా ఇలాంటి అనుభూతినే ఇస్తుంది. ఇక పతాక ఘట్టంలో భారీతనం.. అది ఇచ్చే సంతృప్తి వేరే లెవెల్లో ఉంటాయి. ఇలా సినిమా అంతా హైలైట్లు అని చెప్పుకోదగ్గ ఎపిసోడ్లు చాలానే ఉన్నాయి. అలా అని సినిమాలో అభ్యంతరాలు-ప్రతికూలతలు లేవని కాదు. పార్ట్-1 వయొలెన్స్ డోసే ఎక్కువ అనుకుంటే.. ఇందులో దాన్ని మించి హింస ఉంది. ఈ కథకు అది అవసరం అని దర్శకుడు బలంగా నమ్మే అలా చేశాడని అర్థమైనప్పటికీ.. అది అందరికీ రుచించకపోవచ్చు. రెహమాన్ దైకత్ పాత్ర పార్ట్-1లో ముగిసిపోవడంతో దాన్ని మ్యాచ్ చేసే విలన్ పాత్ర-పెర్ఫామెన్స్ లేని లోటు ఇందులో కనిపిస్తుంది. ఇక రాజకీయాలు.. ప్రాపగండాల గురించి ఎవరి అభ్యంతరాలు వారికి ఉంటాయి. నిజంగా ఇదంతా జరిగిందా.. హీరో ఒక్కడు ఇంత చేశాడా.. అనే ప్రశ్నలు వెంటాడుతాయి. చాలా సీన్లు అతిశయోక్తుల్లా అనిపిస్తాయి. కానీ ఈ అభ్యంతరాలు ఎన్ని ఉన్నప్పటికీ.. నాలుగ్గంటలు పాటు ఊపిరి బిగబట్టి సినిమా చూసేలా చేయడంలో మాత్రం ఆదిత్య ధర్ విజయవంతం అయ్యాడు.
నటీనటులు:
రణ్వీర్ సింగ్.. జస్కీరత్ సింగ్ రంగి అలియాస్ హంజా అలీ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. ఇలాంటి పాత్ర-నటన తన కెరీర్లో నభూతో అనడంలో సందేహం లేదు. నభవిష్యతి అని కూడా ధీమాగా అనొచ్చు. కెరీర్లో ఒక్కసారే చేయగల ఈ పాత్ర కోసం అతను పెట్టిపుట్టాడని చెప్పొచ్చు. ఆద్యంతం అద్భుతమైన నటనతో అతను కట్టిపడేశాడు. లుక్.. మేనరిజమ్స్.. యాక్టింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ అతను నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నాడు. రణ్వీర్ నట విశ్వరూపం గురించి చెప్పడానికి ఉదాహరణగా చాలా ఎపిసోడ్లే ఉన్నాయిందులో. ఇంకెవరినీ ఊహించుకోలేని స్థాయిలో అతను ఈ పాత్రలో ఒదిగిపోయాడు. అతడికి జోడీగా నటించిన సారా అర్జున్ గొప్ప పరిణతితో నటించింది. రెండు సన్నివేశాల్లో ఆమె ఎమోషన్లు పలికించిన తీరు ఎంతో ఆకట్టుకుంటుంది. సంజయ్ దత్ మరోసారి తన శ్వాగ్ చూపించాడు. పవర్ ఫుల్ గా అనిపిస్తూనే.. చాలా ఎంటర్జైనింగ్ గా సాగుతుంది తన పాత్ర. మేజర్ ఇక్బాల్ పాత్రలో అర్జున్ రాంపాల్ చాలా బాాగా చేశాడు. రెహమాన్ దైకత్ స్థాయి క్యారెక్టర్ కాకపోయినా.. అతను బాగా పెర్ఫామ్ చేశాడు. జమీల్ పాత్రలో రాకేష్ బేడీ మరోసారి అదరగొట్టాడు. అజిత్ దేవోల్ స్ఫూర్తితో తీర్చిదిద్దిన సన్యాల్ పాత్రలో మాధవన్ కూడా భలేగా పెర్ఫామ్ చేశాడు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘దురంధర్-2’ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది. కెమెరా యాంగిల్స్.. టేకింగ్.. కలర్ థీమ్స్.. మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా అనిపిస్తుంది. నిజంగా పాకిస్థాన్లోనే ఉన్న భావన కలిగేలా ల్యారీ సిటీని క్రియేట్ చేసిన తీరు అద్భుతం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఎంత కొనియాడినా తక్కువే. ఎంతో సమాచారం సేకరించి.. దాని చుట్టూ కథాకథనాలు అల్లిన తీరు.. తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. తన టేకింగ్ గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో.. ‘దురంధర్’తో దర్శకుడిగా అతను చాలా ఏళ్లు గుర్తుండిపోతాడనడంలో.. ఈ చిత్ర ప్రభావం ఇండియన్ సినిమా మీద చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు.
చివరగా: దురంధర్: ది ర్యాంపేజ్
రేటింగ్- 3.25/5