టాలీవుడ్‌పై హాలీవుడ్ దండయాత్రను తట్టుకోవాలంటే?
తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ మార్కెట్‌లో అంతకంతకూ పెరుగుతున్నా... హాలీవుడ్ ఆధిపత్యం మాత్రం తగ్గడం లేదు.;
ఈ నిజాన్ని జీర్ణించుకోవడం మనందరికీ కొంత ఇబ్బందిగానే అనిపించవచ్చు.. కానీ ఇది అక్షర సత్యం! గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకుల అభిరుచుల్లో ఊహించని మార్పు వచ్చింది. హాలీవుడ్ నుంచి వచ్చే భారీ యాక్షన్ చిత్రాలు.. సూపర్ హీరో ఫ్రాంచైజీలకు మన ప్రజలు బానిసలైపోయారు. ఒకప్పుడు ఆంగ్ల సినిమాలను కేవలం నగరాలకే పరిమితమైన వినోదంగా చూసేవారు కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. హాలీవుడ్ నుంచి ఒక క్రేజీ ప్రాజెక్ట్ వస్తోంది అంటే.. దాని ముందు తెలుగు సినిమా నిలబడుతుందా లేదా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. మన అగ్ర హీరోల సినిమాలతో సమానంగా హాలీవుడ్ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తుండటం గమనార్హం.
తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ మార్కెట్‌లో అంతకంతకూ పెరుగుతున్నా... హాలీవుడ్ ఆధిపత్యం మాత్రం తగ్గడం లేదు. భాషా భేదం లేకుండా కంటెంట్‌ను ఆదరించే భారతీయ ప్రేక్షకులకు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక ప్రధాన వినోద అవసరంగా మారాయి. కోట్లాది మంది థియేటర్లకు తరలివచ్చి ఆంగ్ల సినిమాలను చూస్తూ.. మన దేశీ కరెన్సీని భారీగా విదేశీ సంస్థలకు అప్పగిస్తున్నారు. జూలై 31న రాబోతున్న `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే`, అలాగే డిసెంబర్‌లో విడుదల కానున్న `అవెంజర్స్: డూమ్స్‌డే`, `డూన్ 3` వంటి చిత్రాలపై నెలకొన్న హైప్ ప్రస్తుతం మన స్థానిక సినిమాలపై లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.
మన కరెన్సీ మన దేశంలోనే ఉండాలన్నా..మన సినీ పరిశ్రమ మరింత పటిష్టంగా ఎదగాలన్నా టాలీవుడ్ లేదా భారతదేశం నుంచి భారీ ప్రాజెక్టులు సరైన సమయంలో రావాలి. ఈ సమ్మర్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ దండయాత్రను అడ్డుకోవాలంటే రాజమౌళి రూపొందిస్తున్న `వారణాసి`, ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ యాక్షన్ డ్రామా డ్రాగన్, ప్రభాస్ `కల్కి 2` లేదా అల్లు అర్జున్-అట్లీల `రాకా` వంటి భారీ చిత్రాలు బరిలో ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తూ మే నెల మొత్తం పెద్ద సినిమాల సందడి లేక ఎడారిలా కనిపిస్తోంది. రామ్ చరణ్ పెద్ది జూన్ 4న ఫిక్స్ అయినా.. మే లో సరైన లోకల్ సినిమాలేవీ లేకపోవడం హాలీవుడ్‌కు కలిసొచ్చే అంశం. ఇక నాని `ది ప్యారడైజ్` విడుదలపై స్పష్టత లేకపోవడం ఎగ్జిబిటర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
స్థానిక స్టార్ల సినిమాల విడుదల నిరంతరం ఆలస్యం కావడం వల్ల ప్రేక్షకులు హాలీవుడ్ కంటెంట్ లేదా డిజిటల్ వినోదానికి శాశ్వతంగా అలవాటు పడే ప్రమాదం ఉంది. ఈ దండయాత్రను తట్టుకోవాలంటే మన పరిశ్రమ కొన్ని కీలక మార్పులు చేసుకోవాలి. మొదటిగా విడుదల తేదీల ప్రణాళిక విషయంలో పక్కాగా ఉండాలి. హాలీవుడ్ సంస్థలు ఏళ్ల ముందే డేట్స్ ఫిక్స్ చేసుకున్నట్లు.. మన నిర్మాతలు కూడా తేదీల విషయంలో క్లారిటీ ఇస్తే థియేటర్లు వెలవెలబోవు. రెండవది సాంకేతిక నాణ్యత .. కేవలం హీరోల ఇమేజ్ మీద కాకుండా, విజువల్స్- మేకింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తేనే గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగలము.
అంతేకాకుండా కథల ఎంపికలో వైవిధ్యం చూపడం మూడవ ముఖ్య సూచన. ప్రాంతీయతను ప్రతిబింబిస్తూనే యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథలను ప్రోత్సహించాలి. నాలుగవది మార్కెటింగ్ వ్యూహాలు ముఖ్యం. హాలీవుడ్ స్థాయిలో మన సినిమాలను గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రమోట్ చేయాలి. ఐదవది థియేటర్ అనుభవం అప్ గ్రేడ్ అవ్వాలి. ప్రేక్షకుడు ఓటీటీ వదిలి థియేటర్‌కు రావాలంటే ఐమాక్స్ (IMAX) వంటి అత్యాధునిక సాంకేతికతను సామాన్యుడికి అందుబాటులోకి తేవాలి. అప్పుడే సినిమా చూడటం అనేది ఒక గొప్ప అనుభూతిగా మారుతుంది.
ఇంకా చెప్పాలంటే.. టాలీవుడ్ కానీ దేశీ సినిమా కానీ.. వైభవాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం స్థానిక పోటీపైనే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలపై దృష్టి సారించాలి. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు, అద్భుతమైన నటులు ఉన్నారు.. కావాల్సిందల్లా సరైన ప్రణాళిక .. సాంకేతికతతో కూడిన మేకింగ్ మాత్రమే. హాలీవుడ్ చిత్రాలు మన దేశంలో `ప్రైమరీ ఈవెంట్స్`గా మారకముందే మన ఫిలింమేకర్స్, హీరోలు అంతా మేల్కొని ప్రేక్షకులకు నిరంతరం నాణ్యమైన వినోదాన్ని అందించాలి. అప్పుడే బాక్సాఫీస్ వద్ద మన సినిమాల హవా ఎప్పుడూ సాగుతుంది.