ఫెడరేషన్ అధ్యక్షుడిపైనా కేసులు పెడతాం.. అతడిని నమ్మొద్దు: సుమలత!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదాలు రోజురోజుకూ ముదురిపాక‌న ప‌డి ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నాయి. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సుమలత తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-09-24 12:44 GMT

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదాలు రోజురోజుకూ ముదురిపాక‌న ప‌డి ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నాయి. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సుమలత తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్‌లో జరుగుతున్న పరిణామాలు, కొందరి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వివాదానికి సంబంధించి దాసరి మాస్టర్‌తో పాటు రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్లపై కూడా తాము అధికారికంగా కంప్లైంట్ ఇచ్చినట్లు సుమలత స్పష్టం చేశారు. అలాగే లిఖిత, పూజిత, కల్యాణి, మాధుర్య, కోకిల తదితర మహిళా డ్యాన్సర్లపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించేందుకు సీసీ కెమెరాలు, ఫుటేజ్‌లు వంటి అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారని.. త్వరలోనే త‌న‌పై దాడికి పాల్ప‌డిన అంద‌రిపైనా ఎఫ్‌ఐఆర్ ఫైల్ అవుతుందని సుమ‌ల‌త‌ వెల్లడించారు.

అసోసియేషన్‌లో తీసుకున్న నిర్ణయాలు, నకిలీ సంతకాలపైనా ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా 225 సంతకాలు, 225 మంది ఆమోదంతో రఘు మాస్టర్ ని అధ్య‌క్షుడిగా ఎంపిక చేస్తూ తీర్మానం చేశారంటున్నారని, అసలు ఆ 225 మంది అసలు మీటింగ్‌కే రాలేదని సుమలత ఎదురు ప్ర‌శ్నించారు. మీటింగ్‌కే హాజరు కాని అంతమంది మద్దతు ఎలా సాధ్యమని.. ఆమోదం ఎలా కుదిరిందని నిలదీశారు. జూన్ 14 , మే 31 తేదీల్లో జరిగిన జనరల్ బాడీ సమావేశాల ప్రస్తావన తెస్తూ.. వారంతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఫెడ‌రేష‌న్ అధ్యక్షుడు అనిల్ తీరుపై సుమలత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనిల్ గారిని తాము ఇప్పటివరకు ఒక సాధారణ వ్యక్తిలాగే అంచనా వేసామని..కానీ తాజా సమావేశంతో ఆయన అసలు స్వరూపం ఏమిటో తమకు క్లియర్ కట్ గా అర్థమైందని సుమ‌ల‌త అన్నారు. ఎవరినైనా నమ్మొచ్చు గానీ అనిల్ గారిని మాత్రం అసలు నమ్మడానికి వీలే లేదని హెచ్చరించారు. ఆయనపై కూడా తాము త్వరలోనే చట్టపరంగా కేసులు పెడతామని.. ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అలా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

తమకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. అవసరమైతే కోర్టును ఆశ్రయించి న్యాయం ఎలా జరుగుతుందో చూస్తామని సుమలత హెచ్చ‌రించారు. ఇప్పటికైనా ఫెడరేషన్ పెద్దలు.. ఛాంబర్ పెద్దలు జోక్యం చేసుకుని తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న ఈ అంతర్గత పోరు టాలీవుడ్‌లో మరింత కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా 225 మంది స‌భ్యులు స‌మావేశానికి రాక‌పోయినా, అంత‌మంది మ‌ద్ధ‌తు ర‌ఘు మాస్టార్ కి ఎలా సాధ్య‌మైంది? అనే ప్ర‌శ్న చ‌ర్చ‌కు వ‌చ్చింది. అలాగే ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడిపైనా సుమ‌ల‌త తీవ్ర ఆరోప‌ణ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సుమ‌ల‌త‌పై దాడి వివాదంలో వాస్త‌వాలేమిట‌న్న‌ది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది.



Tags:    

Similar News